Pawan Kalyan: ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే.. అడగ్గానే వెంటనే సహాయం.. ప్రశంసలు కురిపించిన పాకీజా!

Pawan Kalyan: ఒకప్పటి నటి, లేడీ కమెడియన్ వాసుకి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పాకీజా అనే క్యారెక్టర్ తో బాగా గుర్తింపు తెచ్చుకోవడంతో అప్పటినుంచి ఈమెను పాకీజా అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఒకప్పుడు అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, పెదరాయుడు వంటి అనేక తెలుగు, తమిళ సినిమాలలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ‌త‌ కొంత‌కాలంగా ఆమె దీన స్థితిలో బతుకుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ తినడానికి కూడా తిండి లేక చాలా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే.

గతంలో సహాయం చేయమంటూ చాలామందిని వేడుకోవడంతో చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆమెకు సహాయం చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారిపోవడంతో నటి పాకీజా ఏపీ ప్రభుత్వాన్ని సహాయం కోరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సహాయం చేయమంటూ ఆమె వేడుకొంది. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో వైరల్ అయిన వెంటనే మంచి మనసుతో స్పందించారు పవన్ కళ్యాణ్.

ఆమె పరిస్థితి గురించి తెలుసుకుని దాదాపుగా ఆమెకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాజాగా మంగళగిరిలోని జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, పి.గన్నవరం శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణలు ఆమెకు అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంద‌ర్భంగా వాసుకీ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తూ.. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే ప‌వ‌న్ కళ్యాణ్ కార్యాల‌యానికి తెలియ‌జేశాన‌ని, త‌క్ష‌ణ‌మే స్పందించి ఆర్థిక సాయం అందించార‌ని చెప్పారు. పవన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నేతలు స్పందిస్తూ ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.