ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకువెళతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ రోజు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీఅవుతారు. వరదలు, అకాల వర్షాలతోతో జరిగిన పంటనష్టం పరిహారం చెల్లింపులపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించే అవకాశముంది. అలాగే ,శాసన మండలి రద్దుతోపాటు, పెండింగ్ నిధుల విడుదలపైనా అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు.
ఇక ఆర్ధిక పరమైన అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను సైతం కలిసే అవకాశముంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ఆయన కోరనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది.