ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం మధ్య ప్రస్తుతం వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఈసీ నిమ్మగడ్డ.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరోసారి ఏపీ హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం… కోర్టులో అదనపు అఫిడవిట్ ను సమర్పించారు.
అయితే.. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ… కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా నియంత్రణలోనే ఉండటంతో… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అలాగే…ఎన్నికల కమిషన్ కు భద్రతను పెంచాలంటూ అఫిడవిట్ లో ఎన్నికల సంఘం కోర్టును కోరింది. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇప్పటికే.. ఏపీ ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించడం లేదన్న ఎన్నికల సంఘం పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించాల్సిందేనని వ్యాఖ్యానించింది.