AP: ఏపీ కూటమి పార్టీలలో దూరం పెరుగుతోందా అంటే అవుననే తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ కి ఇవ్వాలి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు నాయుడు సమక్షంలోనే బహిరంగ వేదికగా పలువురు టిడిపి నాయకులు డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ పూర్తి స్థాయిలో అర్హులని ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బాగుంటుంది అంటూ చంద్రబాబు నాయుడుకు సలహాలు కూడా ఇచ్చారు.
ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులు డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా లోకేష్ కి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు స్పందించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జనసేన ఘాటుగా స్పందిస్తోంది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మంచిదే కానీ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రిగా వెళ్లి బాధ్యతలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు టిడిపికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలైన రఘురామకృష్ణం రాజు ,సోమిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు లోకేష్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడానికి పూర్తిస్థాయిలో అర్హులంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విధంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవిని అప్పచెప్పి పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టాలని ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉందని కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనక జరిగితే తమ నాయకుడి పరిస్థితి ఏంటి అనే ఆందోళన జనసైనికులు కనబరుస్తున్నారు. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల మధ్య వార్ జరుగుతుంది.