Andhra Pradesh: ఎట్టకేలకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య పెంచడం షురూ చేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా 30 నుంచి 40 వేల మధ్య మాత్రమే టెస్టుల సంఖ్యను పరిమితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా టెస్టుల సంఖ్య 72 వేలకు పెంచింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎక్కువ టెస్టులు చేస్తే, కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే బయటపడ్తాయి. తద్వారా ట్రేసింగ్ వీలవుతుంది. చికిత్స మరిం తేలికవుతుంది. తద్వారా కరోనా వ్యాప్తి తగ్గుతుంది.
అయితే, ఇక్కడ టెస్టులు పెరుగుతోంటే, కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 25వ తేదీన వెలువడిన బులెటిన్ చూస్తే, సుమారు 12,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. దాదాపు 62 వేల మందికి పరీక్షలు చేయడంతో. అదే, 25వ రోజు వెలువడిన బులెటిన్ చూస్తే, సుమారు 72 వేల టెస్టులు జరిగాయి.. వెలుగు చూసిన పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం దాదాపు 9800 మాత్రమే. ఈ మతలబు ఏంటి.? అన్నదే ఇప్పుడు చాలామంది అనుమానం.
టెస్టుల సంఖ్య పెరిగి, పాజిటివ్ కేసులు తగ్గితే అంతకన్నా ఏం కావాలి.? అయితే, ఇక్కడ ప్రభుత్వం వాస్తవ కేసుల సంఖ్యను దాచిపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుండడమే బాధాకరం. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు కరోనా టెస్టుల్లో పారదర్శకత కనిపిస్తోంది మొదటి వేవ్ దగ్గర్నుంచి కూడా. తెలంగాణ విషయంలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. పదే పదే న్యాయస్థానం మొట్టికాయలు వేస్తూనే వుంది తెలంగాణ ప్రభుత్వానికి.
కాగా, ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి కూడా కరోనా టెస్టుల విషయమై కోర్టు నుంచి అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత నుంచే టెస్టుల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా వేవ్ అత్యంత తీవ్రంగా వున్న పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియాలి. టెస్టుల సంఖ్య పెరగాలి. టెస్టుల సంఖ్య పెంచి, నిజమైన లెక్కలే ప్రభుత్వాలు చెబుతోంటే, అర్థం పర్థం లేని విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అనుమానాలకు తావిచ్చేలా పాజిటివ్ కేసులు తగ్గుతోంటే మాత్రం.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.