మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర చికిత్స అవసరమైనా ఫోన్ కొట్టగానే క్షణాల్లో ముందుకొస్తుంది అంబులెన్స్. అందులో పని చేసే సిబ్బంది ఎలాంటి ఆపత్కర పరిస్థితిలోనైనా మేమున్నామంటూ ముందుకొచ్చి సాయం చేస్తుంటారు. దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా? వాటిని చేధించుకుని ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత్రి..పగలు.. టైమ్ అంటూ ఏదీ ఉండదు. అవసరాన్నిబట్టి 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మానవసేవయే మాధవసేవ అనడానికి ఈ సిబ్బందిని గొప్ప ఉదాహరణ గా చెప్పొచ్చు. అయితే అలాంటి అంబులెన్స్ సిబ్బంది శ్రమని కార్పోరేట్ కంపెనీలు నిలువునా దొచుకుంటున్నాయి.
గవర్న మెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రాజెక్ట్ ను కార్పోరేట్ కంపెనీలు దక్కించుకుని అటుపై సిబ్బందితో ఎలాంటి ఆటలు ఆడుతాయో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం 108,104 సేవలు ఎంతో గొప్పగా అందాయి. టైమ్ టు టైమ్ జీతాలు ఇవ్వడం..ప్రత్యేక ప్యాకేజీ..కొత్త వాహనాల కోనుగోళ్లు వంటి కార్యక్రమాలు బాగా జరిగేవి. వైఎస్ ఉన్నంతకాలం జీవీకే ఆధ్వర్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగాయి అయితే వైఎస్సార్ మరణం తర్వాత వాటి రూపమే మారిపోయిన సంగతి తెలిసిందే. జీవీకే సిబ్బంది శ్రమని దోచే కార్యక్రమం పెట్టింది.
అటుపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అరాచక శక్తులు ఎక్కువైపోయాయి. జీవీకే టీడీపీతో కుమ్మక్కై సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లు అప్పట్లో కథనాలు వేడెక్కించాయి. పని ఒత్తిడి పెంచడం, జీతాలు ఇవ్వమని ప్రశ్నిస్తే తిరుగు దాడి చేయడం వంటివి ఆ పార్టీకే చెల్లాయని నిరూపించాయి. నిబంధనల ప్రకారం సిబ్బందికి చెల్లించాల్సిన పీఎల్, ఈఎల్, గ్రాడ్యూటీ, జీతాలు, రిలీవింగ్ బిల్స్, లొకేషన్ బిల్స్ వంటివి చెల్లించకుండా మెల్లాగా జీవీకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అటుపై బీవీజీ ఆ బాధత్యల్ని తీసుకుంది. ఈ కంపెనీ కూడా ఇదే నిర్వాకం వెలగబెట్టింది. ప్రస్తుతం బీవీజీ ఆధ్వర్యంలోనే వాహనాలు తిరుగుతున్నాయి.
అయితే ఈ బీవీజీ మెయింటనెన్స్ సరిగ్గా చేయలేకపోవడం..కాల పరిమితి దగ్గరపడటంతో ప్రాజెక్ట్ ను వదులుకునే దిశగా ఉంది. అయితే బీవీజీ కూడా సిబ్బందికి భారీగానే పెండింగ్ బిల్స్ పెట్టింది. జీవీకే చెల్లించాల్సిన బిల్లులను బీవీజీ చెల్లిస్తుందని అప్పటి అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు బీవీజీ కూడా తప్పుకోవడానికి రెడీ అవ్వడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు మారుతున్నా తమ బ్రతుకులు మాత్రం మారడం లేదని, ఎవరికి వారు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే తమకు చెల్లించాల్సిన పీఎల్, ఈఎల్, గ్రాడ్యూటీ, నెలవారీ జీతాలు, రిలీవింగ్ బిల్స్, లొకేషన్ బిల్స్ చెల్లించాలని డిమాండ్ చేసారు.
జీవీకే వల్ల ఒక్కో ఉద్యోగి 70 నుంచి 80 వేలు నష్టపోగా, బీవీజీ నిర్వాకం వల్ల 30 వేలు నష్టపోవాల్సి వస్తోందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటిని ప్రభుత్వం చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీవీజీ కాలపరమితి జులైతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల్ని ప్రభుత్వం అరబిందో కార్పోరేట్ ఫార్మా కంపెనీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో జులైలో లోపు తమకు చెల్లించాల్సిన బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించాలని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే యంగ్ సీఎం ప్రకటించిన కొత్త జీతాలను వీలైనంత త్వరగా అమలులోకి తీసుకు రావాలని సిబ్బంది కోరారు. అలాగే కొవిడ్-19 కారణంగా అంబులెన్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ డ్యూటీ రోజుల్లో చెల్లించే జీతాలు కన్నా అదనంగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.