అల్లు అర్జున్ కెరీర్లో ఒకసారి సినిమా అనౌన్స్ అయితే ఆగిపోవడం అంటూ జరగలేదు. మొదలుపెట్టిన సినిమాను పూర్తిచేసితీరేవారు ఆయన. కానీ ‘ఐకాన్’ అనే చిత్రం మాత్రం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో పడింది. వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య’ సినిమా చేశాక బన్నీ ‘ఐకాన్’ చిత్రాన్ని ప్రకటించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. అయితే అక్కడి నుండి సినిమా ముందుకెళ్ళలేదు. ‘నా పేరు సూర్య’ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను పక్కనపెట్టారు బన్నీ. ఉన్నపళంగా హిట్ కావాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేశారు.
ఆశించినట్టే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాతైనా ‘ఐకాన్’ పట్టాలెక్కుతుంది అనుకుంటే ఎక్కలేదు. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ సినిమాను ప్రకటించారు. మరి హిట్ వచ్చాక కూడ వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ను బన్నీ మొదలుపెట్టకపోవడానికి రీజన్ ఏమిటయ్యా అంటే మధ్యలో వేణు శ్రీరామ్ పవన్ సినిమాను ఓకే చెప్పడమేనని అంటున్నారు. సుకుమార్, వేణు శ్రీరామ్ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయాలి అనే మీమాంసలో బన్నీ ఉండగా ‘వకీలు సాబ్’ సెట్ చేసుకున్నారు వేణు శ్రీరామ్. దీంతో బన్నీ వేణు ఆ సినిమా చేస్తే తప్పకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడని, అప్పుడు అతనితో వర్క్ చేస్తే సినిమాకు పూర్తిస్థాయి హైప్ వస్తుందని లెక్కలు వేసుకుని ‘పుష్ప’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీన్నిబట్టి త్వరలో రిలీజ్ కానున్న ‘వకీల్ సాబ్’ గనుక విజయం సాధిస్తే ‘ఐకాన్’ సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదు.