అల్లు అర్జున్ ఎన్నాళ్ళ నుండో పక్కన పెట్టిన ప్రాజెక్ట్ ‘ఐకాన్ – కనబడుటలేదు’ ఎట్టకేలకు తెర మీదకు వస్తోంది. వేణు శ్రీరామ్ మీద నమ్మకం లేకనో లేకపోతే కథలో బలం లేదనో ఆ సినిమాను పక్కనపెట్టాడు బన్నీ. కానీ ఇప్పుడు వేణు శ్రీరామ్ స్థాయి మారింది. ‘వకీల్ సాబ్’ విడుదల తర్వాత ఆయన స్టామినా మీద నమ్మకం పెరిగింది. పవన్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేయగలిగాడు అంటే తన సినిమాను కూడ బాగానే నడిపించగలడనే నమ్మకం ఏర్పడింది బన్నీతో. అందుకే ‘ఐకాన్’ పనులు రీస్టార్ట్ అయ్యాయి.
దిల్ రాజు అయితే వేణు శ్రీరామ్ వర్క్ పట్ల చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. అందుకే అనుమానం లేకుండా ‘ఐకాన్’ అతనే తీస్తాడని బల్లగుద్ది చెప్పేశారు. మరోవైపు ‘పుష్ప’ పూర్తవ్వగానే బన్నీకి పెద్ద డైరెక్టర్ ఎవ్వరూ దొరికే పరిస్థితి లేదు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అందరు స్టార్ డైరెక్టర్లు బిజీగానే ఉన్నారు. అందుకే బన్నీ శ్రీరామ్ వేణుకు ఓటేసేశారు. ఇప్పటికే సినిమా పనులు మొదలయ్యాయట. కథాపరమైన సిట్టింగ్స్ జరుపుతున్నారట. ‘పుష్ప’ పనులు ముగియగానే బన్నీ వీటిలో ఇన్వాల్వ్ అవుతారట.