Allu Arjun : తన సినిమా ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్, ఇతర హీరోల అభిమానుల మెప్ప పొందేందుకు మేగ్జిమమ్ ప్రయత్నించాడా.? అందుకే, ఆయా హీరోల సినిమాల్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాడా.? నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైందీ అందుకేనా.? ఇంతా చేసి, అల్లు అర్జున్ సాధించిందేంటి.?
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్న రాత్రి నుంచే ‘పుష్ప’ టాక్ సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ట్వీట్ రివ్యూలు, ఫేస్ బుక్ కామెంట్లు.. ఇన్‌స్టాగ్రామ్ ముచ్చట్లూ.. అబ్బో, ‘పుష్ప’ చుట్టూ జరిగిన, జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు.
సినిమా ఎలా వుంది.? అన్న విషయమై అల్లు అర్జున్ అభిమానులకీ, అల్లు అర్జున్ హేటర్స్‌కీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. డిజాస్టర్ టాక్ హేటర్స్ నుంచి వస్తోంది. దాన్ని ఎదుర్కొనడానికి అల్లు అర్జున్ అభిమానులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ప్రధానంగా నందమూరి కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ మీద భయంకరమైన ట్రోలింగ్ నడుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులైతే మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ‘పుష్ప’ సినిమాని. విజయ్ దేవరకొండ అభిమానులదీ అదే దారి. మహేష్ అభిమానులు కూడా అల్లు అర్జున్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.
వున్నంతలో మెగా అభిమానులు అల్లు అర్జున్‌కి కాస్త బాసటగా నిలుస్తున్నారు. చిత్రమేంటంటే, ‘అఖండ’ సినిమా విషయంలో ఇంత నెగెటివిటీ కనిపించలేదు. సినీ అభిమానులంతా ఒక్కతాటిపైకి వచ్చి, ఆ సినిమా పట్ల పాజిటివ్ టాక్ ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. సో, అల్లు అర్జున్ కష్టం వృధా అయినట్టే.. అందరి హీరోల అభిమానుల్నీ శాటిస్‌ఫై చేయాలనుకోవడంలో.