స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఆయన మార్కెట్ స్థాయి కూడ రెట్టింపైంది. మొదటి నుండి బన్నీకి ఇతర హీరోలకు లేని ప్రత్యేకత ఒకటుంది. అదే ఇతర భాషల్లో ఫ్యాన్ బేస్. బన్నీని మలయాళ ప్రేక్షకులు విపరీతంగా అభిమానిస్తుంటారు. ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. అక్కడే కాదు కన్నడలోనూ బన్నీ సినిమాలకు డిమాండ్ ఉంది. యూట్యూబ్ ద్వారా విడుదలయ్యే బన్నీ డబ్బింగ్ సినిమాలకు మిలియన్లల్లో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఆ క్రేజ్ భోజ్పురి ఇండస్ట్రీకి కూడ పాకింది. అక్కడా బన్నీ డ్యాన్సులకు, నటనకు ఫిదా అవుతున్న వాళ్ళు ఉన్నారు.
బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం యావరేట్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. కానీ డబ్బింగ్ వెర్షన్లు మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. హిందీలో డబ్ కాబడిన ఈ చిత్రం 325 మిలియన్ల వ్యూస్ సాధించగా ఇటీవలే భోజ్పురి భాషలోకి డబ్ అయింది. అక్కడ కూడ సినిమా విపరీతమైన వ్యూస్ తెచ్చుకుంది. దింఛాక్ ఛానెల్ ద్వారా విడుదలైన ఈ సినిమా 39.83 లక్షల ఇంప్రెషన్స్ సాధించింది. ఇంతవరకు ఏ భోజ్పురి సినిమా కూడ ఈ స్థాయిలో ఇంప్రెషన్స్ సాధించలేదు. ఇప్పుడు ఆ రికార్డ్ బన్నీ పేరు మీద నమోదైంది. దీన్నిబట్టి ఇతర భాషల ప్రేక్షకులకు అల్లు అర్జున్ మీద ఏ స్థాయి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.