ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని బాలీవుడ్ సినీ జనాలు ‘సౌత్ సూపర్ స్టార్..’ అంటూ కొనియాడుతున్నారు. కారణమేంటో తెలుసా, తన సినిమాతోపాటు, ఇతర హీరోల సినిమాలు.. తెలుగు సినిమాలతోపాటు, ఇతర భాషల సినిమాలూ బాగా ఆడాలని కోరుకోవడమే. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటూ అల్లు అర్జున్ ఇచ్చిన పిలుపుకి బాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
నాగశౌర్య హీరోగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అల్లు అర్జున్, ‘రొమాంటిక్’ తదితర సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించాడు. తన సినిమా ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వస్తోందనీ, దాన్నీ ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు.
అంతేనా, కరోనా వల్ల సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొందనీ, దాన్నుంచి గట్టెక్కేందుకు సినీ పరిశ్రమ ప్రయత్నిస్తోందని అన్నాడు. తెలుగుతోపాటు అన్ని భాషల సినీ పరిశ్రమలూ కరోనా కారణంగా ఇబ్బందులు పడ్డాయన్న అల్లు అర్జున్, ఈ కష్ట కాలం నుంచి అందరూ గట్టెక్కాలని ఆకాంక్షించాడు.
బాలీవుడ్ సినిమా ‘సూర్యవంశీ’కి కూడా అల్లు అర్జున్ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం గమనార్హం. బాలీవుడ్ ఏస్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన ప్రసంగానికి ఫిదా అయిపోయారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ట్రెండ్ బాగా మారింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు.. అన్న తేడాల్లేకుండా.. ప్రతి ఒక్కరూ అన్ని సినిమాల్నీ తమ సినిమాలుగా భావిస్తూ, వాటిని ప్రమోట్ చేసేందుకు ముందుకొస్తున్నారు. హీరోల అభిమానుల మధ్య గొడవలు చల్లారేందుకు ఇదో మంచి మార్గం.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
కరోనా వల్ల నష్టపోయిన సినీ పరిశ్రమ కోరుకోవాలంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అన్న తేడాల్లేకుండా సినిమా అనేది ప్రేక్షకులందరికీ వినోదాన్ని పంచాలి, ప్రేక్షకులందరికీ చేరువవ్వాలి.. ప్రేక్షకుల్ని ఆకర్షించాలి. అలా చేయాలంటే, హీరోలతా ఇలా ముందుకొచ్చి ప్రమోషన్లకు తమవంతుగా సహకరించాలి.