తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా 2018 మే 21, 22 తేదీల్లో జరిగిన ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనపై నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని తాజాగా రజనీకాంత్ కు ఒక మహిళా జ్యుడిషియల్ ప్యానెల్ మరోసారి సమన్లు జారీ చేసింది. గతంలో కూడా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ రజనీకాంత్‌కు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ఆయన హాజరు కాలేదు. దీంతో తాజాగా ఇప్పుడు మరోసారి సమన్లు జారీ అయ్యాయి.
సంఘ విద్రోహ శక్తులు ఆందోళనల్లో పాల్గొనడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూడా పేర్కొంది. సంఘ విద్రోహ శక్తులను అణిచివేయాలని ప్రభుత్వాన్ని రజనీకాంత్ నాడు డిమాండ్ చేశారు.