Andhra Pradesh Capital : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అని ఒప్పుకోవడానికి అధికార వైసీపీ ససేమిరా అంటోంది. 2024 వరకు హైద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రధానిగా వుంటుందని విభజన చట్టం చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దాంతో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి ఆమోద ముద్ర వేశాక, దానికి కేంద్రం కూడా నోటిఫై చేశాక.. ఇంకా రాజధాని హైద్రాబాద్ అనడమేంటి.?’ అంటూ అచ్చెన్నాయుడు గుస్సా అయ్యారు.
మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది గనుక, అధికార వైసీపీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. ప్రస్తుతానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని శాసన రాజధాని.. అంటూ ‘చిన్నచూపు’ చూడటం ఎవరికీ తగదు.
రేప్పొద్దున్న మూడు రాజధానుల బిల్లు పెడితే, అది చట్ట రూపం దాల్చితే, దానికి న్యాయ వివాదాలేవీ రాకపోతే.. అప్పుడు మాత్రమే, అమరావతి స్టేటస్ మారుతుంది. ఈలోగా వైసీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రయోజనం లేదు.
నిజానికి, అమరావతి మీద అక్కసుతోనో, టీడీపీ మీద అక్కసుతోనో రాజధానిని వివాదాస్పదం చేయాలన్న ఆలోచనను అధికార వైసీపీ పక్కన పెడితే మంచిది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ, రాజధాని గురించి మళ్ళీ చర్చ మొదటికి రావడం అత్యంత విషాదకరం.