Tollywood: తండ్రి కాబోతున్న టాలీవుడ్ కమెడియన్.. ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ!

Tollywood: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు కమెడియన్, యూట్యూబర్ మహేష్ విట్టా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ విట్టా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అతని కామెడీ టైమింగ్స్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. మొదట యూట్యూబర్ గా కెరియర్ను ప్రారంభించిన అతను ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు, కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ విట్టాకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టాయి.

రాయలసీమ యాసలో కామెడీ చేస్తూ నవ్వించిన వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అదే పాపులారిటీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, ఇందు వదన లాంటి చాలా సినిమాలలో నటించి తన నటనతో కామెడీతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అలాగే బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్‌లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు మహేష్. ఇది ఇలా ఉండే తాజాగా మహేష్ తన అభిమానులకు ఒక శుభవార్తను తెలిపాడు. అదేమిటంటే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేశాడు.

తన భార్య బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అందులో తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫొటోస్ కి ఫోజులు ఇచ్చాడు మహేష్ విట్టా. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ” మా కథలోకి మరొకరు వస్తున్నారు. త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం ” అని రాసుకొచ్చాడు. అయితే మహేష్ విట్టా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మహేష్ విట్టా 2023 సెప్టెంబర్ లో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. శ్రావణి మరెవరో కాదు మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతిరూపంగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు.