మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకి వేడెక్కుతుంది. పూటకి ఒకరు చొప్పున ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శించుకుంటూ మీడియాకి మేత బాగా అందిస్తున్నారు. ఇదంతా వీక్షిస్తున్న సామాన్య ప్రజానీకానికి ఒకింత అసహనం కూడా మొదలైంది. సెప్టెంబర్ లో జరిగే ఎన్నికలకి ఇప్పటి నుంచే వీరు చేస్తున్న హడావిడి అతిగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలా “మా” గోల సాగిపోతున్న వేళ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఓ పోస్టుతో అందరినీ ఆసక్తిపరిచాడు. అదేంటంటే… చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ‘మా’ ఎన్నికల వ్యవహారం మీద తనదైన శైలిలో అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ ఫోటో ఫన్నీగా ఉండటంతో ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్ లో మాస్క్ లేకుండా ఉన్న జింగ్ పిన్ బ్రహ్మాజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే… ఆయన మాత్రం మాస్క్ పెట్టుకుని నమస్కరిస్తున్నారు. ఈ ఫొటోతో పాటు ‘ఇది సాధారణ మీటింగ్ మాత్రమే. ఎలాంటి రాజకీయాలకు తావులేదు. ‘మా’ ఎన్నికల గురించి చర్చించాం. ఆయన నాకు కొన్ని టిప్స్ చెప్పారు’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఇది ‘మా’ ఎన్నికల మీద సెటైర్ అని కొందరు నెటిజన్స్ భావిస్తుంటే… జస్ట్ ఫన్నీ పోస్ట్ అని మరికొందరు అంటున్నారు.