2021 Massive Headlines : 2021 రచ్చ రంబోలా: సమంత, ‘మా’ ఎన్నికలే.!

2021 Massive Headlines : ‘వకీల్ సాబ్’ సినిమా వివాదం, ‘పుష్ప’ సినిమా హంగామా, ‘అఖండ’ మేనియా.. ఇవన్నీ ఓ యెత్తు.. 2021 సంవత్సరానికి సంబంధించి సినీ పరిశ్రమలో తిరుగులేని గలాటా సృష్టించిన రెండు ప్రధాన సంఘటనల్లో ఒకటి సమంత విడాకుల వ్యవహారం కాగా, మరొకటి ‘మా’ ఎన్నికలు.

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలంటే, అది వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ చిన్న అసోసియేషన్ ఎన్నికలు మాత్రమే. కానీ, దేశ భక్తి సహా కులం, మతం, ప్రాంతం.. ఇలా చాలా వివాదాల్ని ‘మా’ ఎన్నికల కోసం తెరపైకి తెచ్చారు. కొండంత రాగం తీసి, తుస్సుమనిపించినట్లుగా.. ‘మా’ ఎన్నికల తర్వాత అంతా సైలెంటయిపోయారు.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చేశాయి ‘మా’ ఎన్నికలు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రకాష్ రాజ్ మీద స్థానికేతరుడన్న ముద్ర వేశారు కొందరు నిస్సిగ్గుగా. మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు చేసే సత్తా తెలుగు సినిమాకే వుందంటూ పండగ చేసుకుంటున్నారు సినీ పరిశ్రమలో.

ఇక, సమంత విడాకుల వ్యవహారానికొస్తే.. సినీ పరిశ్రమకు విడాకులు కొత్త కాదు. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడం వారి వారి వ్యక్తిగత విషయం. ఇద్దరూ విడిపోయారు, ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ, సమంత మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది, ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది.

బీభత్సమైన ట్విస్ట్ ఏంటంటే.. ఏడాది చివర్లో సమంత స్పెషల్ సాంగ్ చేయడం. ‘పుష్ప’ సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ సంచలనాలకే కాదు, వివాదాలకూ కేంద్ర బిందువుగా నిలిచింది.
అటు ‘మా’ ఎన్నికల గొడవ అయినా, ఇటు సమంత చుట్టూ వివాదాలైనా.. ఇదంతా ఓ పబ్లిసిటీ అనే అభిప్రాయం చాలామందిలో వుంది.