108 కాంట్రాక్టుల స్కామ్.. విజయసాయిరెడ్డికి చిక్కులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వం పలు పథకాలు, ప్రాజెక్టుల విషయంలో అధిక ధరకు సేవలను కొనుగోలు చేస్తూ అవినీతికి పాల్పడిందని, తద్వారా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల సన్నిహితులకు లబ్ది చేకూరిందని, ఫలితంగా ప్రభుత్వం నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపిస్తూ పలు అనేక కాంట్రాక్టులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ విధానానికి తెర తీసిన సంగతి తెలిసిందే.  ఈ చర్యల ద్వారా ప్రభుత్వ నిధుల్లో మిగులు కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.  కానీ వారి హయాంలో కూడా ఇలాంటి నిధుల దుర్వినియోగం జరుగుతోందని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. 
 
అందుకు సాక్ష్యమే 108 వాహనాల నిర్వాహణ భాద్యతలను అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు ఇవ్వడం అంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు ఆయన.  గత ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణకు ఒక్కో అంబులెన్సుకు నెలకు 1.31 లక్షల చొప్పున బీవీజీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది.  కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కాంట్రాక్టును రద్దు చేసి కొత్త అంబులెన్సుకు నెలకు 1.78 లక్షలు, పాతవి ఒక్కోక అంబులెన్సుకు నెలకు 2.21 లక్షలు చెల్లిస్తూ అరబిందో ఫార్మా ఫౌండేషన్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.  పాత ప్రభుత్వం ఒప్పందంతో పోలిస్తే ఈ కొత్త ఒప్పందం ఖర్చులు చాలా ఎక్కువ. 
 
ఈ కాంట్రాక్ట్ కుదర్చడంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రామ్ ప్రసాద్ రెడ్డిల పాత్ర ఉందని, అందుకు కారణం విజయసాయి అల్లుడు రోహిత్ రెడ్డికి అరబిందో ఫార్మాలో పెద్ద ఎత్తున షేర్స్ ఉండటమేనని, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కుదర్చడంలో విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి పాత్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  అసలే కన్నా, విజయసాయిరెడ్డిలు ఉప్పు, నిప్పుల్లా ఉంటారు.  కన్నా టీడీపీకి అమ్ముడుపోయారని గతంలో విజయసాయి అనేకసార్లు అన్నారు.  మరి ఈ కొత్త ఆరోపణల నేపథ్యంలో ఆయన మళ్లీ అదే ఆరోపణ చేస్తారో లేకపోతే సరైన సమాధానం ఇస్తారో చూడాలి.