రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు వైఖరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎంతటి తలనొప్పిగా మారిందో తెలిసిందే. కింది స్థాయి నాయకుల నుండి అధినేత వైఎస్ జగన్ వరకు రఘురామరాజు తీరుపై గుర్రుగానే ఉన్నారు. అనేక కీలక విషయాల్లో ప్రభుత్వం విధానానికి వ్యతిరేకంగా మాట్లాడిన రఘురామరాజు ఒకానొక దశలో బలాబలాల గురించి కూడా సవాళ్లు చేశారు. దీంతో పార్టీ నుండి ఆయన్ను బహిష్కరించాలనే తీర్మానం జరిగిందట. అందుకే ఆయనకు షోకాజ్ నోటీసులివ్వగా వాటిలోని లోపాల్ని పట్టిన రఘురామరాజు ఏకంగా పార్టీ పేరు మీదే పెద్ద దుమారం రేపారు.
దీంతో ఆయన్ను సాగనంపడానికి ఉన్న అన్ని దారులను వెతికిన అధిష్టానం చివరికి లోక్ సభ స్పీకర్ ద్వారానే అది సాధ్యమనే నిర్ణయానికి వచ్చింది. అందుకే వైకాపా ఎంపీలు, లాయర్లు స్పీకర్ ఓంబిర్లాను కలవడానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రేపు శుక్రవారం వారికి స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారట. ఇప్పటికే రఘురామరాజు మీద పెద్ద నివేదిక తయారుచేసిన సదరు బృందం దాన్ని స్పీకర్ ముందుంచి రాఘురామరాజు ప్రవర్తన స్వచ్చంధంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకునే ధోరణిలో ఉందని ఆయనకు నమ్మకం కలిగించాలి.
కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. వైకాపా నేతలకంటే ముందే ఢిల్లీ వెళ్లిన రఘురామరాజు స్పీకర్ ఓంబిర్లాను కలిసి సమగ్ర చర్చలు జరిపారు. వాటిలో ఆయన చెప్పాల్సింది చెప్పి, కొరాల్సింది కోరే ఉంటారు. అందులో అనుమానమే లేదు. ఇక ఆయనకు మోడీ, అమిత్ షా స్థాయిలో హెల్తీ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి వారి సపోర్ట్ ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. నిజానికి వారి బ్యాకప్ చూసుకునే రాజుగారు ఈ సాహసాలన్నీ చేస్తున్నారు. పైగా ఓంబిర్లా ఎలాగూ బీజెపీ వ్యక్తే. మొత్తంగా చూస్తే ఢిల్లీలో పరిస్థితులు, మనుషులు వైకాపా కంటే రఘురామరాజుకే అనుకూలం. మరి ఈ సిట్యుయేషన్లో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ ఢిల్లీ వెళ్లిన వైకాపా బృందం రఘురామరాజు మీద అనర్హత వేటుకు మాట తీసుకుని వస్తారో లేకపోతే నిరాశతో వస్తారో చూడాలి.