తెలంగాణ పరిస్థితి ఏపీ కంటే దారుణంగా ఉందా ?

 

తెలంగాణ పరిస్థితి ఏపీ కంటే దారుణంగా ఉందా ?

కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో పాలనా వ్యయానికి నిధులు లేని కష్ట కాలం నెలకొంది. ఈ పరిస్థితి నుండి కొంత ఉపశమనం కోసం అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. వాటిలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాల ఉద్యోగులు కష్టంగానే ఉన్నా మౌనంగానే కోతను భరించారు. మొదటి నెల ఎలాగోలా సర్దుకున్నా రెండో నెలలో మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. మూడో నెల నుండైనా పూర్తి జీతాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు.

వారి వినతిని ఏపీ సర్కార్ అర్థం చేసుకుంది. జూన్ ఆరంభంలో ఇవ్వవలసిన మే నెల జీతాలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత రెండు నెలల బకాయిల్ని కూడా ముందు రోజుల్లో చెల్లిస్తామని వైఎస్ జగన్ తెలపడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యోగుల కష్టాలే మరొక నెల కొనసాగనున్నాయి. ఇప్పటికే రెండు నెలలు అర జీతాలతో బండి నెట్టుకొచ్చిన వారికి మూడో నెల కూడా కోత తప్పదని కేసీఆర్ ప్రకటించారు.

దీంతో ఉద్యోగులు మౌనంగానే బాధపడుతున్నారు. ఇన్నాళ్ళు తెలంగాణ దనిక రాష్ట్రం అంటూ వచ్చిన కేసీఆర్ ఆపత్కాలంలో వరుసగా మూడు నెలలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టారు. రాష్ట్రానికి ప్రతి నెలా 12,000 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా 3,100 మొట్లి మాత్రమే వచ్చాయని, అందులో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తే 3000 కోట్లు ఖర్చై ఖజానా ఖాళీ అవుతుందని అన్నారు. అంతేకాక వేల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

అయినా ఎలాంటి ఆదాయ మార్గం లేని ఏపీ సర్కార్ వారి ఉద్యోగులకు మూడో నెల నుండి పూర్తి జీతాలు ఇస్తోంది. పైగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజల ఖాతాల్లో వేల కోట్లు జమ చేస్తోంది. అలాంటిది హైదారాబాద్ నుండి ఇన్నాళ్ళు ఆదాయం ఆర్జిస్తూ అన్ని విధాలా ఆంధ్రా కంటే మెరుగైన ఆర్థిక స్థితి కలిగిన తెలంగాణ సర్కార్ మాత్రం ఆదాయం లేదంటూ జీతాల్లో కోత పెట్టడం ఆ రాష్ట్ర ఉద్యోగులకు సైతం అంతుబట్టడం లేదు. కొందరైతే ధనిక రాష్ట్రం అనేది పైపై మాటేనా.. వాస్తవంలో తెలంగాణ పరిస్థితి ఏపీ కంటే దారుణంగా ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.