రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ కొనసాగాలనే తీర్మానం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద ఇరు రాష్ట్రాలకు హక్కులు ఉంటాయని, దానికి భంగం కలగకుండా ఉండేందుకు పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 8ని చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా ఆస్తులకి రక్షణ, ఆంధ్రా ప్రజల, ఉద్యోగుల స్వేచ్చకు, ఆస్తులకు రక్షణ ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతి భద్రతలకు భంగం కలిగి ఆంధ్ర రాష్ట్ర ఆస్తులకు నష్టం వాటిల్లితే గవర్నర్ సెక్షన్ 8ని ప్రయోగించి రక్షణ కల్పించవచ్చు. ఇప్పుడు ఈ సెక్షన్ పేరు చెప్పే సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో వదిలేసుకుంది. చంద్రబాబు తన హయాంలో ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలన్నింటినీ ఆంధ్రాకు తరలించేశారు. పూర్తిగా అక్కడి భవనాలను ఖాళీ చెసేశారు. తమకంటూ ఒక రాజధాని ఉండాలని ఆమరావతి కట్టడాన్ని స్టార్ట్ చేశారు. ఇక కొత్త ప్రభుత్వం అయితే స్వచ్ఛంధంగా ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి వదిలేసింది. దాంతో ఆస్తుల మీద సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వం వశమయ్యాయి. ఇవన్నీ చూపించే హైకోర్టు నుండి సచివాలయం కూల్చివేతకు అనుమతులు తెచ్చుకున్నారు కేసీఆర్.
ఇక కూల్చివేత జరుగుతున్నా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ కొత్త ముఖ్యమంత్రి జగన్ కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇవన్నీ తెలిసి మాట్లాడినా లాభం ఉండదని ఏపీ ప్రజలు కూడా మౌనంగా ఉండిపోయారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 8ని చూపి అడ్డుకోవాలని అనుకోవడం ఏదో చేయాలి కాబట్టి చేస్తున్న పనే తప్ప ఏదో ఆపేద్దాం అని కాదు. అందుకే తెరాస నాయకులు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను ఆంధ్రానే స్వచ్ఛందంగా ఆస్తులను వదులుకుంది. అలాంటిది మీ రగడ ఏమిటని తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు గడిచినా ఇంకా తెలంగాణ మీద ఆంధ్రా పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారా అంటూ తెలంగాణ సెంటిమెంట్ లెవనెత్తుతున్నారు.