వైసీపీలో గొడవలు.. విడదల రజనీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్

వైసీపీలో గొడవలు.. విడదల రజనీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్
వైసీపీలో పలువురు జిల్లా స్థాయి నేతల మధ్య గ్యాప్ బాగా పెరుగుతోంది.  ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎవరికి వారు ఆయా జిల్లాల మీద పట్టు కోసం పోటీ పడుతున్నారు.  ఈ పోటీలో ఒక్కోసారి పరోక్షంగా, ఒక్కోసారి ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు యుద్దానికి దిగుతున్నారు.  ఈ పోరులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆధిపత్య పోరు బాగా హైలెట్ అవుతోంది.  ఇప్పటికే పలుసార్లు ఎమ్మెల్యే విడదల రజనీ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య సైలెంట్ వార్ జరిగింది.  ఎంపీని గతంలో ఒకసారి రజనీ వర్గీయులు కాన్వాయ్ ఆపి మరీ నిలదీశారు.  ఇరు వర్గాలు కొట్లాటకు కూడా దిగాయి.  ప్రొటోకాల్ సాకు మీద కూడా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గతంలో చిచ్చు రగిలింది. 
 
 
ఇక తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కారును స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని వర్గీయులు బుధవారం అడ్డుకున్నారు.  వైసీపీ నాయకులు గంటా హరికృష్ణ తల్లి యశోద కొద్ది రోజులక్రితం మృతిచెందడంతో  ఆయనను పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చిరుమామిళ్ల గ్రామానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విడదల రజినీ వర్గీయుడు, చిలకలూరిపేట మార్కెట్‌యార్డ్ వైస్‌ చైర్మన్‌ సింగారెడ్డి కోటిరెడ్డి తమ అనుచరులతో ఎంపీ కారును అడ్డుకున్నారు.  తమకి తెలీకుండా గ్రామానికి ఎలా వస్తారని వాగ్వాదానికి దిగారు. 
 
 
కానీ తాను రాజకీయపరమైన పనుల మీద రాలేదని, పరామర్శకు మాత్రమే వచ్చానని ఎంపీ చెప్పినా వినలేదు.  చివరికి పోలీసులు కలుగజేసుకునే వరకు వారు వెనక్కి తగ్గలేదు.  ఈ వర్గ పోరుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే రజనీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అంటున్నారు కొందరు.  చిలకలూరిపేటకు చెందిన మరొక వైసీపీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సహకరిస్తున్నారని, తనని కాదని ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని రజనీ కోపమట.  మర్రి రాజశేఖర్ రజనీ కంటే సీనియర్.  2014 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీచేసి ఓడిపోయారు.  2019 ఎన్నికల్లో ఆయన్ను పక్కనబెట్టి అధిష్టానం రజనీకి టికెట్ ఇచ్చారు.  ఆమె గెలిచారు.
 
దీంతో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.  నియోజకవర్గం మీద పట్టు కోసం ఇరువురూ పోటీ పడుతున్నారు.  ఈ నేపథ్యంలో ఎంపీ రాజశేఖర్ కు సహకరిస్తున్నారని, నియోజకవర్గంలో తన ప్రాధాన్యత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని రజనీ ఇంటర్నల్ ఫీలింగ్ అని, అందుకే ఈ గొడవలని టాక్.