వైకాపాలో చేరే విషయమై ఫైనల్ డెసిషన్ తీసేసుకున్న ఎమ్మెల్యే
గత కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. వారిలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినబడింది. అధికార పార్టీకి చెందిన మంత్రి బాలినెని, ఇంకొందరు బడా నేతలు ఏలూరి సాంబశివరావుతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆయన పార్టీ మారతారని గట్టిగా ప్రచారం జరిగింది. పైగా టీడీపీ నేతలెవరూ ఈ వార్తల్ని ఖండించకపోవడం, కొన్నాళ్లుగా సాంబశివరావు తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకి దూరంగా ఉండటంతో ఈ వార్త నిజమేనని తెలుగు దేశం కార్యకర్తలు భావించారు.
ఈ పిరాయింపుల ప్రక్రియ ఇలాగే కొనసాగితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుందని దిగులు చెందారు. కానీ సాంబశివరావు మాత్రం పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. ఎవరో కావాలనే తనపై పుకార్లు పుట్టించారని మాట్లాడారు. ఈరోజు ఉదయం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమగ్ర చర్చలు జరిపిన ఆయన ఈ మాట అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అన్న ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా రాజకీయ నేతగా కన్నా తమ కుటుంబ సభ్యునిగానే చూశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాను.
గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలిగాం
నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వచ్చిన వార్తలు ఖండిస్తున్నాను అన్నారు.
ఒకవేళ నిజంగానే ఏలూరి సాంబశివరావుకు నిజంగానే పార్టీ మారే ఆలోచనే లేకపోతే ఇన్ని రోజులుగా ఆయనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆలస్యంగా ఎందుకు స్పందిస్తారు. నిప్పు లేకుండా పోగా రాదు అన్న చందంలో ఇంతలా వదంతులు వచ్చాయంటే మార్పుపై ఏదో కసరత్తు జరగబట్టే వచ్చి ఉండొచ్చు. పైగా ఈరోజు ఉదయం నుండి విపరీతమైన చర్చలు జరిగిన తర్వాతే ఆయన పార్టీ మారట్లేదని చెప్పారు. అంటే పార్టీ మార్పుకు పనులు మొదలయ్యాయి.. కానీ మధ్యలో చంద్రబాబు ఎంటరై ఏదో సర్దిచెప్పడంతో ఆయన వెనక్కి తగ్గి ఉండొచ్చు. ఇలాంటి వ్యవహారాలను ప్రజలు గతంలో అనేకం చూశారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే టీడీపీని వీడటంలేదని చెప్పడం ఆ పార్టీకి శుభవార్తే.