వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రద్దు ముమ్మాటికీ అసాధ్యం

రఘురామకృష్ణ రాజు ఉదంతం వైకాపాలో పలు సంచలనాలకు దారి తీసింది.  రాఘురామరాజు ఢిల్లీలోని పెద్దలతో, అధికారులతో మంతనాలు జరుపుతుండటంతో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.  వాటిలో ప్రధానమైనది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రద్దవడం.  తనకు వైఎస్సార్సీపీ పేరు మీద షోకాజ్ నోటీసులు వచ్చాయని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యానని, అసలు పార్టీకి క్రమశిక్షణా కమిటీ అనేది ఒకటి లేనే లేదని, ప్రాంతీయ పార్టీకి విజయసాయిరెడ్డిగారు జాతీయ కార్యదర్శి ఎలా అయ్యారని పలు ప్రశ్నల్ని ఎన్నికల సంఘం ముందు ఉంచారట. 
 
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, పార్టీ రద్దవుతుందని ప్రచారం జరుగుతోంది.  ప్రధానంగా తెలుగు దేశం అనుకూల మీడియాలో ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  రాఘురామరాజు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.  కానీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాత్రం రద్దవడమనేది సాధ్యం కాదని అంటున్నారు.  అసలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చట్టం జోక్యం ఉండదని, పార్టీలకు నిర్వహణలో స్వేచ్చ ఇవ్వడానికే రాజ్యాంగంలో ఈ వెసులుబాటు కల్పించారట.  
 
కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే రాజకీయ పార్టీలను చట్టం నియంత్రిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.  ఎన్నికల సమయంలో ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘించకుండా మరియు చట్ట సభలైన పార్లమెంట్, అసెంబ్లీలలో అధికార, ప్రతిపక్ష హోదాల్లో పార్టీల ప్రవర్తన లాంటి అంశాల్లో మాత్రమే చట్టం కలుగజేసుకుంటుందని, అంతేగానీ ఇలాంటి పార్టీ పేర్లు, క్రమశిక్షణా కమిటీ లాంటి ఇతర ఏ వ్యవహారాల్లో చట్టం జోక్యం ఉండబోదని, ఒకవేళ రాఘురామరాజు కోర్టుకు వెళ్లినా వైఎస్సార్ కాంగ్రెస్  రద్దు అసాధ్యమని చెబుతున్నారు.  గతంలో కూడా చట్టం ఇలాంటి విషయాల్లో తలదూర్చిన దాఖలాలు లేవట.  సో.. పార్టీ పేరు విషయంలో రాఘురామరాజు ఎలాంటి చట్టపరమైన చర్యలకు దిగినా అవి టైమ్ పాస్ చర్యలగానే మిగిలిపోతాయన్నమాట.