ప్రత్యర్థుల్ని విమర్శించడానికి, ఇరుకునపెట్టడానికి రాజకీయ నాయకులు చేసే వాఖ్యలు ఒక్కోసారి వారినే చుట్టుకుంటుంటాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ విమర్శల సారాంశం చేసిన వారికే ఆపాదించబడుతుంది. ప్రజెంట్ ఈ చిత్రమైన పరిస్థితి వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిగారికి ఎదురైంది. ట్విట్టర్లో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే విజయసాయిగారు తన ట్వీట్లతో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. ఏ పొలిటీషియన్ చేయనంత ఘాటుగా విజయసాయిగారి వ్యాఖ్యలు ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి ఆయన సోషల్ మీడియా గొంతుక అనొచ్చు.
తాజాగా విజయసాయిరెడ్డి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అవినీతి కేసులు, అరెస్టుల గురించి మాట్లాడుతూ ‘తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి’ అంటూ ట్వీటారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడి కింద మీరు అరెస్ట్ కాలేదా, 16 నెలలు జైలుకు వెళ్ళలేదా, ప్రతి శుక్రవారం కోర్టులో మీ కేసుల విచారణ జరగట్లేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
అంతేనా టీడీపీ నేతల మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. వారిని నేరస్థులుగా కోర్టు ప్రకటించలేదు. అంటే వారు ప్రస్తుతానికి అనుమానితులు మాత్రమే. వారికి కూడా హక్కులు ఉంటాయి అంటూ మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనూ లాజిక్ ఉంది మరి. ఎందుకంటే తమ మీద ఉన్న కేసులన్నీ అక్రమమైనవేనని, తమని అక్రమంగానే అరెస్ట్ చేశారని, మోపబడిన నేరాలు రుజువు కాలేదు కాబట్టి తాము క్లీన్ అని వాదిస్తుంటారు. మరి అలాగైతే ఇప్పుడు టీడీపీ నేతల మీద వేసిన కేసులు కూడా ఇంకా ప్రూవ్ కాలేదు, విచారణలోనే ఉన్నాయి. కాబట్టి విజయసాయిగారు తమ కేసుల విషయంలో చెప్పే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనే సూత్రం టీడీపీ నేతలకు కూడా వర్తిస్తుంది.