నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం పాటు లేటు అన్నట్లు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పనితీరు. ఒక రాజకీయ పార్టీకి ఉండకూడని అవలక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్. నిదానపురం జమీందారు కూడా చిన్నబుచ్చుకునేంత నెమ్మదిగా సాగుతాయి ఈపార్టీ పనులు. ఎన్నిసార్లు ఓడినా పాఠాలు మాత్రం నేర్చుకోరు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఇక కార్యకర్తలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే నాకేంటి అనే బాపతు.
ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ దూసుకొస్తున్నా ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ పార్టీ సత్తా ఏంటో దుబ్బాకలో తేలిపోయింది. బీజేపీ దూకుడు పెంచేసరికి అసలు బరిలోనే లేకుండా పోయింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలే అయినప్పటికీ సీఎం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గెలుపు బాధ్యత అప్పగించారు. ఏమాత్రం తేడా వచ్చినా కేసీఆర్ సంగతి తెలుసు కదా…యాక్షన్ కూడా అంతే సీరియస్ గా ఉంటుంది.
ఇక బీజేపీ కూడా కసరత్తు మొదలు పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ల నుంచి మళ్లీ రామచందర్ రావునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి దాదాపు అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది.
ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ కనీసం ఆసక్తి కనబరిచే అభ్యర్థుల వివరాలు కూడా సేకరించలేదు. గూడురు నారాయణ రెడ్డి, కూన శ్రీశైలం యాదవ్ ఇలా జాబితా చాలా మంది పార్టీ టిక్కెట్ అశిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో అవకాశాలు రాని వాళ్లంతా ఇప్పుడు సిద్ధం అవుతున్నారు. ఒక్కో వర్గం ఒక్కో అభ్యర్థిని బలపరుస్తోంది. దీంతో ఎవరి పేరు ప్రకటించకుండా కాంగ్రెస్ ఎప్పటి లాగే సైలెంట్ గా ఉంటోంది. మరోవైపు జనసమితి నుంచి ఆపార్టీ అధినేత కోదండరాం పోటి చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తనకు మద్దతు ఇస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు కోదండరాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కూడా తేల్చడం లేదు. మద్ధతు ఇచ్చేది లేని చెప్పదు. అటు అభ్యర్థులను ప్రకటించదు.