క్రమశిక్షణను అతిక్రమించవద్దు.. నాగబాబుకిది పవన్ వార్నింగ్ అనుకోవచ్చా ?
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు మొన్నామధ్యన గాడ్సే పుట్టినరోజును పురస్కరించుకుని పెద్ద వివాదమే లేవదీశారు. నాథూరాం నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. గాడ్సే వైపు వాదనను ఆ రోజుల్లో మీడియా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా చేశాడు. అతని దేశభక్తిని శంకించలేము. మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ సానుభూతి స్టేట్మెంట్ ఇచ్చారు.
దీంతో రగడ మొదలైంది. అందరూ పవన్ కళ్యాణ్ ఏమో గాంధీ వాదం గొప్పదని అంటే ఆయన సోదరుడు మాత్రం గాడ్సే కరెక్ట్ అంటాడు. అయినా గాంధీని హత్య గావించిన గాడ్సేను వెనకేసుకుని రావడం ఏమిటని అందరూ మండిపడ్డారు. ఇక ఇతర పార్టీల వారైతే అందరికీ క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్పే పవన్ సొంత అన్న, పార్టీలోని వ్యక్తి ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే మౌనంగా ఎందుకున్నారు. అందరికీ ఒక న్యాయం, అన్నకు ఇంకో న్యాయం అంటూ ఎద్దేవా చేశారు. చివరికి వ్యవహరం పార్టీకి తలనొప్పివా పరిణమించింది.
దీంతో పవన్ స్పందించారు. పార్టీలో ఎందరో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు వ్యక్తపరిచే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం మాత్రమే. వాటికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాగబాబుగారు సోషల్ మీడియాలో తెలిపిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. వాటికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ వాటిని వక్రీకరించి పార్టీకి అన్వయిస్తున్నవారికి క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు పార్టీలోని ప్రతి ఒక్కరికీ చెబుతున్నా ఇది జనం కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. ఇలాంటి సమయంలో ప్రజాసేవ తప్ప వేరే అంశాల జోలికి వెళ్ళవద్దు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకుసాగాలి అంటూ చురకలు వేశారు. పార్టీలోని సొంత మనుషులు పెద్ద పెద్ద వివాదాలకు కారణమైతేనే పార్టీ అధినేతలు చూస్తూ ఉండటమో, వారిని వెనకేసుకురావడమో చేసే రోజులివి. అలాంటిది పవన్ వివాదానికి కారకుడు సొంత అన్న అయినా అందరితో సమానంగా ట్రీట్ చేసి క్లారిటీ ఇవ్వడం అభినందించదగిన విషయం.