ఏడాది మొత్తం వెలుగులు విరజిమ్మిన జగన్ నవరత్నాలు 

 

ఏడాది మొత్తం వెలుగులు విరజిమ్మిన జగన్ నవరత్నాలు 

 
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటితో సరిగ్గా సంవత్సరం ముగిసింది.  కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లతో అఖండ మెజారిటీతో చరిత్ర ఎరుగనటువంటి విజయాన్ని అందుకున్న జగన్ సగర్వంగా సీఎం పదవిని అలంకరించారు.  ఒక్క అవకాశం.. జీవితాలు మారుస్తాను అంటూ ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసిన జనం కళ్ల నిండా కాంతులు నింపుకుని నవరత్నాలు మోసుకొస్తున్న నాయకుడికి ఆహ్వానం పలికారు.  
 
ఈ యేడాది పాలనలో జగన్ శక్తివంచన లేకుండా పనిచేశారనడంలో అనుమానమే లేదు.  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీఠ వేసిన ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని నెరవేర్చడంలో వెనకడుగు వేయలేదు.  ఖజానాలోని సింహ భాగాన్ని సంక్షేమ పథకాలకే ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల పాలకులు సైతం ఏపీ వైపు తిరిగి చూసేలా చేశారు. 
 
1.అమ్మ ఒడి ఆనందం పంచింది :
 
ప్రతి బిడ్డకూ చదువు అందాలి, బడికి వెళ్లే బిడ్డల తల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.  ఒకటి నుండి 12వ తరగతి వరకు తమ పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15,000 వేస్తామని చెప్పి గత యేడాది జమ చేశారు.  రెండో విడతగా ఈ యేడాది డిసెంబర్లో ఇంకో రూ.15,000 వేయనున్నారు.  ఈ పథకం ద్వారా సుమారు 45 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి.  
 
2. రైతు భరోసా వెన్ను తట్టింది :
 
నవరత్నాల్లో మరో అపూర్వమైన పథకం వైఎస్సార్ రైతు భరోసా.  ఈ పథకం ద్వారా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ప్రతి యేటా రూ. 12,500 ఇస్తామని చెప్పారు.  రైతులకు ఒక్కొక్కరికి రూ.5,500లు ఖాతాల్లో వేశారు.  ఏప్రిల్ నెలలో ఇచ్చిన రూ.2000లతో కలిపి ఈ మొత్తం రూ.7,500కు చేరుకుంది.  ఇక అక్టోబర్లో రూ.4000, జనవరిలో రూ.2000 అందజేయనున్నారు.  దీంతో ఒక్కో రైతు రూ.13,500 సహాయం పొందనున్నాడు.  అయితే ఈ పథకంలో చిన్న తిరకాసు ఉందనే విమర్శ ఉంది.  ఈ 13,500 రూపాయల్లోనే పీఎం కిసాన్ పథకం కింద వచ్చే రూ.6000 కూడా ఉంది.  ఎన్నికలకు ముందు ఈ 6000లతో కలిపి 12,500 అని జగన్ చెప్పలేదు.  పథకంలో ఈ మెలిక ఉన్నా 48 లక్షల మందికి పైగా రైతులకి మాత్రం పెట్టుబడి సాయం అందింది. 
 
3. ఆరోగ్యశ్రీ ఆయుష్షు పెంచింది:
 
కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందాలనే గొప్ప లక్ష్యంతో ఆనాడు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అనే అద్భుతాన్ని ప్రవేశపెట్టగా వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చాక దానికి ఇంకాస్త మెరుగులు దిద్దారు.  5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి వైద్య ఖర్చులు 1000 దాటితే ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించేలా పథకం రూపొందించారు.  ఈ పథకాన్ని ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల్లో కూడా ఏపీ వాసులకు అందేలా వెసులుబాటు కల్పించారు.  చికిత్స అనంతరం ఇంటికి వెళ్లే వారికి ఖర్చుల నిమిత్తం విశ్రాంతిలో ఉన్నన్ని రోజులు నెలకు గరిష్టంగా 5000 సహాయాన్ని అందిస్తున్నారు.  అంతేకాదు ఈ పథకం కింద కొత్తగా 936 వ్యాధులను చేర్చారు.  మొత్తానికి ఈ పథకం పేదల ఆయుష్షును పెంచిందనే అనాలి. 
 
4. పెంచిన పింఛన్లతో లబ్దిదారుల్లో ఆనందం:
 
జగన్ ఎన్నికలకు ముందు పింఛన్లను 2000 నుండి 3000లకు పెంచుతానని మాటిచ్చారు.  కానీ పెంపు ఎలా ఉంటుందో చెప్పలేదు.   ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం దశలవారీగా పెంచుకుంటూ నాలుగేళ్లకు 3 వేలకు తీసుకెళ్తామని అన్నారు.  ఆ మాట ప్రకారమే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదే మొదటి విడత పెంపుగా 250 పెంచుతూ సంతకం చేశారు.  అంతేకాక లబ్దిదారుల వయసును 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించడం మరొక విశేషం.  
 
5. విద్యార్థుల పాలిట వరం ఫీజు రీఏంబర్సిమెంట్ :
 
పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ మొదలుపెట్టిన ఈ ఫీజు రీఏంబర్సిమెంట్ పథకాన్ని జగన్ మరింతగా మెరుగుపరిచారు.  విద్యార్థులకు ఫీజు ఖర్చులే కాదు ఆర్థిక స్థోమత లేని బయట చదువుకునే పిల్లలకు వసతి ఖర్చుల కింద యేడాదికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి పెద్ద వరమే ఇచ్చారు.  
 
6. వైఎస్సార్ ఆసరా ఆదుకుంది :
 
 
ఎన్నికల సమయానికి పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల పేరిట రూ.27,147 కోట్ల అప్పులు ఉన్నాయి. ‌ జగన్‌ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన మేరకు రెండో యేడాది నుంచి ఈ పథకం అమలు చేసేలోపు వడ్డీ భారం మహిళలపై ఏమాత్రం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం రుణంపై పథకం అమలు చేసే నాటికి రూ.2,472 కోట్లు వడ్డీ అవుతుందని అంచనా వేసి, ఆ డబ్బులను ప్రభుత్వం మొదటి సంవత్సరంలో బ్యాంకులకు చెల్లించాలని కూడా నిర్ణయించారు.   రెండో ఏడాది నుంచి రూ.27,147 కోట్ల మొత్తాన్ని సంఘాల వారీగా అప్పును బట్టి నాలుగు విడతల్లో చెల్లిస్తారు. 
 
7. వైఎసార్ జలయజ్ఞం:
 
వైఎస్ జగన్ తండ్రి బాటను అనుసరిస్తూ రైతులకు నీటి సమస్య రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టుల కోసం దాదాపు 85,000 కోట్లను కేటాయించారు.  పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని అన్నారు.  కానీ పోలవరం ప్రాజెక్టు పనులు సన్నగిల్లాయి.  కానీ గ్రేటర్ రాయలసీమ కోసం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కట్టాలని జగన్ సంకల్పించడం అభినందించదగిన విషయం.  
 
8. పేదలందరికీ ఇళ్లు:
 
 పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు.  ఐదేళ్లలో యేడాదికి 5 లక్షల చొప్పున 25 లక్షల ఇళ్లు కట్టాలనేది జగన్ సంకల్పం.  అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటిమీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా ఏర్పాటు ఇందులో విశేషం.  అయితే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం జరగలేదు కానీ జూలై నాటికి 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంది సర్కార్.  
 
9. మద్యపాన నిషేధంలో ప్రగతి:
 
మద్యపాన నిషేదం వలన ఖజానాకు నష్టమని తెలిసినా ఈ పనికి పూనుకుంది జగన్ సర్కార్.  అనుకున్నదే తడవుగా బెల్టు షాపులు, బార్లు, మద్యం షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.  దీని ద్వారా రాష్ట్రంలో లిక్కర్ వినియోగంలో తగ్గుదల కనబడింది.  ఈ పద్దతి మంచిదే అయినా తర్వాత మద్యం ధరలను విపరీతంగా పెంచడం, లాక్ డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు స్టార్ట్ చేయడం, లెక్కకు మించి లోకల్ బ్రాండ్లను విపరీతమైన ధరలకు విక్రయించడం విమర్శలకు దారితీసింది. 
 
మొత్తం మీద జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పూర్తిస్థాయిలో కాకపోయినా మెచ్చుకోదగిన రీతిలోనే మొదటి యేడాదిలో మెరుపులు వెదజల్లాయి.  లబ్ది పొందిన లబ్దిదారులు అయితే నవరత్నాలు భేష్ అని.. వచ్చే నాలుగేళ్లు ఇంకా సమర్థంగా వాటిని అమలుపరిస్తే పాలనలో వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని అంటున్నారు.