ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరు పట్ల జనసేన శ్రేణులు ఛాన్నాళ్ళ నుండి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సైతం రాపాక తీరు పట్ల గుర్రుగానే ఉన్నారు. పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కావాడంతో పార్టీ గొంతుకను అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తారని జనసేన కార్యకర్తలు ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ రాపాక ఆరంభం నుండే అసెంబ్లీలో వైకాపాకు వంత పాడటం మొదలెట్టారు. ఆయన సమావేశాల్లో మైక్ పట్టుకున్న సందర్భాలే తక్కువైతే వాటిలో కూడా ఎక్కువగా సీఎం గొప్పతనాన్ని పొగిడే పని పెట్టుకున్నారు తప్ప పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో చెప్పింది తక్కువ.
ఇక నియోజకవర్గ కార్యక్రమాల్లో సీఎం ఫొటోకు పాలాభిషేకాలు, పొగడ్తలు, అసెంబ్లీలో పార్టీ విధానానికి తూట్లు పొడుస్తూ మూడు రాజధానుల బిల్లుకు మద్దతివ్వడం, రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం లాంటి పనులతో ఆయన మీద శ్రేణుల్లో, పార్టీ అధినాయకత్వంలో పూర్తిగా అసంతృప్తి ఏర్పడిపోయింది. తాజాగా ఎన్నడూ లేని తరహాలో ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. డిబేట్లలో పాల్గొంటున్నారు. వాటిలో పవన్ తీరును ఎండగడుతూ జగన్ గొప్పతనాన్ని ఆకాశానికెత్తుతున్నారు.
పవన్ ఏనాడూ తనకు కలిసే అవకాశం ఇవ్వాలేదన్న రాపాకా పార్టీలో తనకు తగిన ప్రాముఖ్యత లేడని వాపోయారు. ఇక తాజాగా కాపు నేస్తం పథకం అమలులో భాగంగా జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సీఎం జగన్ తనను అన్నా అని సంభోధిస్తూ మాట్లాడారని, అది విని తాను ఎంతో సంతోషించానని, ఇలా ఆప్యాయంగా పలకరించే సీఎం దేశంలోనే ఎక్కడా ఉండరని భావోద్వేగపూరిత మాటలు మాట్లాడారు. మొత్తంగా పవన్ ను కింద జగన్ ను పైన నిలబెట్టే మాటలు బోలెడు మాట్లాడారు రాపాక. అవి విన్న జనసేన శ్రేణులు ఎన్నడూ లేనిది రాపాకను మీడియాలో హైలెట్ చేయడం వెనుక అధికార పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఎలా ఉంటుందని విమర్శలు గుప్పిస్తున్నారు.