వైసీపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెరతీసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలనే కాదు నియోజకవర్గాల్లో కీలక భాద్యతలు నిర్వహించే నేతలపైనా వారు దృష్టి సారించారట. మొదట పార్టీలోకి రమ్మని నెమ్మదిగా అడగటం లేని పక్షంలో వారి ఆర్థిక మూలాల మీద దెబ్బకొడతామని బెదిరించడం పరిపాటిగా మారిందట. అందుకు నిదర్శనమే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ నిన్న టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అంటున్నారు తెలుగు దేశం శ్రేణులు.
మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ కొన్నాళ్ళుగా వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ బాధ్యతలకు న్యాయం చేయలేకపోతున్నానని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని ప్రకటించారు. అంతేకాదు తర్వాత ఏ పార్టీలో చేరతాననేది కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. 1994 నుండి టీడీపీలో కొనసాగుతున్న మనోహర్ 2004లో ఎమ్మెల్యే కూడా అయ్యారు. 2013లో వైసీపీలో చేరిన అయన మళ్లీ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ప్రజల్లో ఆదరణా ఉంది.
అందుకే జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆయనకు ప్రాముఖ్యం ఎక్కువే ఇస్తుంటారు చంద్రబాబు. అలాంటప్పుడు అయన అకస్మాత్తుగా పార్టీ మారడం వెనక బెదిరింపులు ఉన్నాయని తెలుగు తమ్ముళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనోహర్ యాదమరి మండలం కొటాలలో, తవణంపల్లె మండలం మైనగుండ్లపల్లెలో క్వారీలు ఉన్నాయి. పార్టీ మారకపోతే వాటిలో కొటాలలోని క్వారీకి జరిమానాలు విధిస్తామనే బెదిరింపులు వచ్చాయట. అసలే ఆర్థిక ఇబ్నందుల్లో ఉన్న మనోహర్ చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీకి రాజీనామా చేశారని వినికిడి.