అవంతి శ్రీనివాస్ పదవికే ఎసరు పెట్టారా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కేటాయింపులు జరిగేటప్పుడే సీఎం వైఎస్ జగన్ ఒక నిబంధనను గట్టిగా చెప్పారు.  అదేమిటంటే మొదటి రెండున్నర ఏళ్లలో ఎవరి పనితనం సంతృప్తికరంగా లేకపోయినా రెండున్నరేళ్ల తర్వాత వారి స్థానంలోకి కొత్తవారు వస్తారని జగన్ చెప్పారు.  దీంతో మంత్రి పదవులు అందుకున్న నేతలు ఎవరికి వారు ముఖ్యమంత్రిని మెప్పించడానికి సర్వ శక్తులూ ఒడ్డారు.  అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ తమ అధినేతను పైకిలేపే పని చేశారు.
 
నిత్యం అధినాయకత్వం మెప్పు కోసం గట్టిగా కృషి చేశారు.  ఇలా శక్తివంచన లేకుండా కష్టపడినా కొందరికి పదవీ గండం తప్పేలా లేదు.  కొందరు మంత్రులకు పదవులు ఊడుతాయనే టాక్ గట్టిగా వినబడుతోంది.  వారిలో పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినబడుతోంది.  ఆయన పెర్ఫార్మెన్స్ పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారట.  ఆయన స్థానంలో యువ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు టాక్.  ఎందుకంటే అమర్నాథ్ వైసీపీలో చాలా ఏళ్లుగా ఉంటున్నారు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడ. 
 
2014 ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎంపీగా పోటీచేసి టీడీపీ అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.  అయినా ఆయన పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుకుగానే ఉంటూ వచ్చారు.  2019 ఎన్నికల సమయంలో అవంతి పార్టీ మారి వైసీపీలో చేరినా అమర్నాథ్ రెడ్డి ప్రాముఖ్యత తగ్గలేదు.  ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన జగన్ అవంతిని భీమిలి నుండి పోటీకి దింపారు.  ఇద్దరూ గెలవడంతో మంత్రి పదవి అవంతికి వెళ్ళింది.  అయితే ఆరంభంలోనే అమర్నాథ్ కు న్యాయం చేస్తానని జగన్ మాటిచ్చారట.  ఆ మేరకే తర్వాతి రెండున్నరేళ్లు పదవి అవంతి నుండి అమర్నాథ్ కు వెళ్లొచ్చని అంటున్నారు.  అయితే ఇప్పటికి గడిచింది ఒక సంవత్సరమే.  ఇంకా 18 నెలలు ఉంది.  మరి ఈ టైంలో అవంతి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడగలరేమో చూడాలి.