అక్కడ గెలిచింది వైసీపీ అయినా పైచేయి టీడీపీదే ?

 
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీ అభ్యర్థుల చేతిలో ఎలా ఓడిపోయారో చూశాం.   పేరున్న లీడర్లు సైతం మట్టికరవాల్సి వచ్చింది.  ఈ ఓటమితో చాలా నియోజకవర్గాల్లో తెలుగు దేశం పునాదులు కదిలిపోయాయి.  వచ్చే ఎన్నికల నాటికైనా కుదురుకుంటుందో లేదో అనే సందేహం ఉంది.  మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అయినా క్రిష్ణా జిల్లా నందిగామలో మాత్రం పరిస్థితి వేరేలా ఉందని టాక్.  నందిగామ అంటే మొదటి నుండి టీడీపీకి కంచుకోట.  2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాకముందు వరకు దేవినేని ఫ్యామిలీ చక్రం తిప్పుతూ వచ్చింది. 
 
ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత 2014లో దేవినేని బలపర్చిన తంగిరాల ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య గెలుపొందగా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు 10 వేల ఓట్లతో గెలిచారు.  గెలిచినా కూడా నియోజకవర్గంలో ఆయన హవా కనబడటంలేదనే టాక్ వినిపిస్తోంది.  ఇప్పటివరకు ఆయన నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపే పనులేవీ చేయలేదని, కేవలం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల మినహా కొత్తగా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి లబ్డీ చేకూర్చలేకపోయారట. 
 
లోకల్ స్థాయిలో కొత్తగా అభివృద్ది కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదట.  పార్టీని నమ్ముకున్న చాలామంది పనులు పెండింగ్లో ఉండిపోయాయట.  ఇక ఓడినా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చాలా చురుకుగా ఉన్నారట.  దేవినేని ఫ్యామిలీ మద్దతు ఆమెకు ఉండటం వలన పనుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే వద్దకంటే ఆమె వద్దకే జనం ఎక్కువగా వెళుతున్నారట.  మొత్తానికి ఎన్నికల్లో ఓడినా నందిగామలో టీడీపీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదట.