సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిసాయి. చలపతిరావు ఆదివారం ఉదయం అతని కుమారుడు రవిబాబు ఇంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చలపతి రావు గారి కుమార్తెలు అమెరికాలో ఉన్నందున వారు రావటానికి రెండు రోజులు పడుతుంది కావున, వాళ్ళు తమ తండ్రి చివరి చూపు కోసమని, చలపతిరావు గారి పార్థివ దేహాన్ని, మహా ప్రస్థానంలోని ఫ్రీజర్ లో భద్రపరచడం జరిగింది.
చలపతి రావు గారి కుమార్తెలు మంగళ వారం రాత్రి హైదరాబాద్ చేరుకొని, తమ తండ్రిని కడసారి చూసుకున్నారు. తరువాత బుధవారం ఉదయం మహా ప్రస్థానంలో చలపతి రావు గారి అంత్యక్రియలు అతని కుమారుడు రవిబాబు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మహా ప్రస్థానం విద్యుత్ దహన వాటిక వద్ద ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు అని ఒక పత్రికా ప్రకటనలో కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ అంత్యక్రియలకు, చలపతి రావు గారి కుటుంబంతో బాగా సన్నిహితంగా వున్న చిత్ర పరిశ్రమలోని కొంతమంది హాజరయ్యారు. వారిలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, బండ్ల గణేష్, దామోదర ప్రసాద్, దర్శకులు బోయపాటి శ్రీను, బి గోపాల్, శ్రీవాస్ వున్నారు.
అలాగే అల్లరి రవిబాబుకి బాగా సన్నిహితులైన మంచు మనోజ్, రఘుబాబులు కూడా హాజరైన వారిలో వున్నారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ చలపతిరావు అంత్యక్రియలకు హాజరై కన్నీటి పర్యంతమవుతూ కడసారి వీడ్కోలు పలికారు.
