అంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిత మూవీస్ సమర్పణలో అరుణ్, సృజనలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సురేష్ రెడ్డి దర్శకత్వంలో అంకయ్య ఎమ్ నిర్మిస్తోన్న చిత్రం `వేటాడతా. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా సాయి వెంకట్ క్లాప్ కొట్టారు. వైజాగ్ ఎక్స్ మేయర్ దాడి సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత అంకయ్య ఎమ్ మాట్లాడుతూ…“మా బేనర్ లో `మాయా మహల్` మొదటి చిత్రం. మరో రెండు చిత్రాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా అబ్బాయి అరుణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ నాలుగో చిత్రంగా `వేటాడతా` నిర్మిస్తున్నా. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలపై సినిమా ఉంటుంది. ఇందులో నేను టైటిల్ రోల్ చేస్తున్నా“ అన్నారు.
దర్శకుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ..“ బరి` సినిమా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చింది. `వేటాడతా` నా రెండో సినిమా. ఓ రోజు అంకయ్య గారు స్ర్కిప్ట్ ఇచ్చి చదవమన్నారు. స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అందుకే డైరక్షన్ చేయడానికి ముందుకొచ్చాను. సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో అంకయ్య గారు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వాళ్ల అబ్బాయి అరుణ్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ నెలాఖరులో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. అరకు, నంద్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్స్ కూడా నటిస్తున్నారు“ అన్నారు.
హీరోయిన్ సృజన మాట్లాడుతూ..“హీరోయిన్ గా నాకు ఇది తొలి సినిమా. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
హీరో అరుణ్ మాట్లాడుతూ..“హీరోగా నటిస్తున్న నా తొలి సినిమా ఇది. మా నాన్నగారు మంచి కథ సిద్ధం చేశారు. డైరక్టర్ సురేష్ రెడ్డి గారు మంచి ప్లానింగ్ తో సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు“ అన్నారు.
అంకయ్య, కవిత, రమేష్ కృష్ణ, జయ భరత్ రెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరాః వరప్రసాద్ రెడ్డి; సంగీతంః శేఖర్ మోపూరి; పాటలుః సురేష్ గంగుల; ఎడిటర్ః ఆవుల వెంకటేష్; కాస్ట్యూమ్స్ః సూర్యపల్లి అనిత; పీఆర్వోః రమేష్ చందు; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లాతీఫ్. సిహెచ్, కో-ప్రొడ్యూసర్ః డి.శివ ప్రసాద్; నిర్మాతః అంకయ్య ఎమ్; దర్శకుడుః సురేష్ రెడ్డి అక్కల.