ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత సరైన విజయం లేని చిరంజీవి కెరీర్‌కు వాల్తేరు వీరయ్య మళ్లీ ఊపిరి పోసింది. ఒక విధంగా చెప్పాలంటే ఈయన కెరీర్‌కు ఇదో మలుపు. చిరంజీవి సినిమాలు ఈ జనరేషన్ ఆడియన్స్ చూస్తారా లేదా.. మళ్లీ ఆయనకు రికార్డులు సృష్టించే సత్తా ఉందా లేదా అనే అనుమానాలు వచ్చిన సమయంలో.. అన్నింటికీ సమాధానం చెప్పింది వాల్తేరు వీరయ్య. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా కూడా ఏకంగా 137 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తోనే వరుస సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్.
ముఖ్యంగా రీమేక్ సినిమాల విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు చిరు. తన ఇమేజ్‌కు సరిపోతుంది అనుకుంటే పక్కా మాస్ కథలవైపు అడుగులు వేస్తున్నాడు. అలా చేసిన సినిమానే భోళా శంకర్. 2015లో తమిళంలో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. అక్కడ అజిత్ హీరోగా నటించాడు. కమర్షియల్ సినిమాకు డెఫినేషన్‌లా ఉంటుంది వేదాళం. ఈ కథ తనకు బాగా సూట్ అవుతుందని నచ్చి మెచ్చి తీసుకున్నాడు చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలిసినప్పుడు అభిమానులు కాస్త కంగారు పడ్డారు కానీ ఇప్పుడు విడుదలైన ట్రైలర్, పాటలు చూసిన తర్వాత కాస్త కుదుట పడ్డారు. సినిమాపై నమ్మకాలు కూడా పెరిగాయి. అది బిజినెస్ రూపంలో కనిపిస్తుంది.
భోళా శంకర్ సినిమాకు 90 కోట్ల మేర థియేటర్ బిజినెస్ అయినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. చిరంజీవి రేంజ్‌కు 90 కోట్లు అంటే తక్కువే. కాకపోతే రీమేక్ సినిమాకు మాత్రం ఇది చాలా ఎక్కువ. అందులోనూ మెహర్ రమేశ్ ట్రాక్ రికార్డు చూసిన వాళ్లు ఎవరైనా 90 కోట్ల బిజినెస్ అంటే కాస్త ఓవర్ అయిందనే అనుకుంటారు. కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని మెహర్ రమేశ్ 100 కోట్ల టాª`గ్గంªట్ రీచ్ అవుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మెహర్ పేరు కాకుండా కేవలం చిరంజీవిని మాత్రమే చూస్తున్నారు. అందులోనూ వేదాళం ప్రూవ్ అయిన మాస్ సినిమా కాబట్టి తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు.
తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో దీనికి నిదర్శనం. మూడు రోజులు దుమ్ము దులిపేసిన ఈ సినిమా నాలుగో రోజు చల్లబడిపోయింది. అంత వరకు ఎందుకు..? గతేడాది గాడ్ ఫాదర్ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావడమే కాకుండా పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.. కానీ లాంగ్ రన్‌లో మాత్రం ఈ సినిమా పడిపోయింది. కేవలం 60 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది గాడ్ ఫాదర్. సాధారణంగా చిరంజీవి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. కానీ అది గాడ్ ఫాదర్ విషయంలో జరగలేదు.
దానికి ఒకే ఒక కారణం అది రీమేక్ కావడమే. ఇప్పుడు భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మరి ఇప్పుడు ఆ మ్యాజిక్ జరుగుతుందా.. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11న సినిమా విడుదలవుతుంది. దీనికి లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. 11 శుక్రవారం, 12 శనివారం, 13 ఆదివారం, సోమవారం ఒక్కరోజు మినహాయిస్తే మంగళవారం ఆగస్టు 15 కూడా హాలిడేనే. అంటే ఐదు రోజుల వీకెండ్ అన్నమాట. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ ఐదు రోజులు చాలు 100 కోట్లకు పైగా వసూలు చేయడానికి. మొత్తానికి చూడాలిక మెగాస్టార్ ఏం చేస్తాడో..!