2023లో గట్టి పోటీ ఈ భామల మధ్యే!?

టాలీవుడ్ లో ఈ కొత్త ఏడాది 2013లో ముఖ్యంగా ఇద్దరు బ్యూటీస్ మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. 2022 ఆరంభంలో ‘బంగార్రాజు’తో హిట్ కొట్టింది హీరోయిన్ కృతి శెట్టి. ఈ ఏడాది చివరిలో ‘ధమాకా’తో హిట్ అందుకుంది అందాలభామ శ్రీలీల. గ్లామర్ పరంగా.. యాక్టింగ్ .. డాన్సులలోనూ ఇద్దరూ ఇద్దరే! తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటనలో రాణిస్తూ దుమ్ము దులిపేస్తున్నారు.

ఈ ఏడాది 2023లో ఇద్దరు బ్యూటీస్ చేతుల్లోనూ భారీ ప్రాజెక్టులు ఉండడంతో టాలీవుడ్ దృష్టి వీరిపై పడింది. తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతూనే కృతిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. తన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకాకముందే రెండు చిత్రాలు అంగీకరించింది. ఆ రెండు సినిమాలతో కలుపుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. టాలీవుడ్ లో అడుగు పెడుతూనే ఈ మధ్య కాలంలో ఒక కొత్త హీరోయిన్ హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకోవడం కృతిశెట్టి విషయంలోనే జరిగిందన్నది గమనార్హం. గడచిన 2022 సంవత్సరంలో కృతిశెట్టి నుంచి నాలుగుచిత్రాలు విడుదలయ్యాయి.. అందులో ‘బంగార్రాజు’ మాత్రమే విజయాన్నిఅందుకుంది. 2022 ఆరంభంలో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… ఆ తరువాత వచ్చిన మూడు సినిమాల విషయంలోను అంతటి క్రేజ్ ను చేజిక్కించుకోలేక పోయింది.

ఈ ఏడాది టాలీవుడ్ లోకి రివ్వున దూసుకొచ్చిన మరో భామ బ్యూటీ శ్రీలీల. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉండడమే! కృతిశెట్టి అయితే అలా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన మరో భామ శ్రీలీల! ‘పెళ్లి సందD’ నటించిన శ్రీలీలకు మంచి పేరొచ్చింది. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టింది. ”కేవలం గ్లామర్‌‌‌ను నమ్ముకొని వెండితెరకు రాలేదు.

నటనతోనూ ఆకట్టుకోవాలని అడుగుపెట్టాను” అంటోంది అందాలభామ శ్రీలీల. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’లో తళుక్కున మెరిసిన బ్యూటీ. తొలి చిత్రంతోనే ఆమె అందరి మనసులను ..ముఖ్యంగా యువతరం హృదయాలను దోచేసింది. శ్రీకాంత్ తనయుడు రోష‌న్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీ‌లీల అతడితో జోడీ కట్టినవిషయం తెలిసిందే. ఈ సినిమాను గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఒకే ఒక్క సినిమాతోనే ఇంత పాపులా రిటీయా? అని అందరూ అనుకున్నారు.

అలా.. అనుకున్నారో లేదో.. వెంటనే ‘ధమాకా’ అంటూ మాస్ మహారాజా రవితేజతో జోడీ కట్టేసింది. అంతే.. టాలీవుడ్ లో శ్రీలీల…శ్రీలీల…అంటు జపం చేస్తున్నారిప్పుడు! ‘పెళ్లి సందD’తో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. ‘పెళ్లి సందD’ లో నటనలో మంచి మార్కుల్ని కొట్టేసిన ఈ చిన్నది తన అందచందాలతో వాహ్..అనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మను లైమ్ లైట్‌లోకి తీసుకోచ్చింది దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన వల్లే హీరోయిన్‌గా ఇన్ని అవకాశాలు! టాలీవుడ్ లో తనకు మొదటి అవకాశం ఇచ్చి.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు గారిని ఎన్నటికీ మరచిపోలేనని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’ సినిమాలో కథానాయికగా నటించిన ఈ భామ హిట్ ను అందుకుంది. ఇప్పుడు అదే ఊపులో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. శర్వానంద్, నితిన్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. కృతి శెట్టితో పాటు శ్రీలీల కూడా మంచి డాన్సర్ అనే విషయాన్ని ‘ధమాకా’ సినిమా నిరూపించింది. ఈ ఏడాది ఆరంభంలో కృతి హిట్ అందుకుంటే .. చివరిలో శ్రీలీల హిట్ దక్కించుకుంది. కొత్త ఏడాదిలో చేయడానికి ఇద్దరి చేతుల్లోను పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది!