స్టార్‌బాయ్ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ప్రకటన

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు యువతరం మెచ్చే కథాబలమున్న మీడియం బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ‘టిల్లు స్క్వేర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ ప్రతిభావంతుడు సిద్ధు అందించిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు.

ఇప్పుడు ఈ యువనటుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’తో వస్తున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచడానికి స్టార్ నటి అనుపమ పరమేశ్వరన్ తోడయ్యారు.

ఈ సినిమాని 2023, సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదల తేదీ ప్రకటనతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సినిమా పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు, అనుపమ పరమేశ్వరన్

దర్శకత్వం: మల్లిక్ రామ్
డీఓపీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్