ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 32 ప్రకటన

‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే ’90s’ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తమ ప్రొడక్షన్ నెం. 32ని సగర్వంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. ’90s’ సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. “మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ.” అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది.

Production No 32 - An Unfinished Story | Announcement | Anand Deverakonda, Vaishnavi Chaitanya

తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి మరియు ’90s’ సిరీస్ లో తన అసాధారణ ప్రతిభతో ప్రశంసలు పొందిన ఛాయాగ్రాహకుడు అజీమ్ మొహమ్మద్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రకటన వీడియోతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్‌, ‘బేబీ’ ద్వయంతో కలిసి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: అజీమ్ మొహమ్మద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఫణి కె. వర్మ
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌

టీటీడీ చైర్మన్ కాదు EO ,JEO లే భాద్యత || MV Mysura Reddy Reacts On Tirupati Stampede Incident || TR