SIAA అధ్య‌క్షుడు నాజ‌ర్ చేతుల మీదుగా ప్రారంభ‌మైన న‌న్బన్ ఎంట‌ర్ టైన్‌మెంట్‌

న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, న‌న్బ‌న్ ఆర్ట్స్ క‌ల్చ‌ర్ స్ట‌డీ అండ్ ట్రెజ‌రీ సెంట‌ర్‌ను చెన్నై ట్రేడ్ సెంట‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభించారు. ఈ వేడుక‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు, సినీ తార‌లు పాల్గొన్నారు. న‌న్బ‌న్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో అవార్డుల వేడుక‌ను చాలా గొప్ప‌గా నిర్వ‌హించారు. మ‌హ‌తి అకాడ‌మీ నుంచి కొంద‌రు స్టూడెంట్స్ పాడిన ప్రార్థ‌నా గీతంతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత డ్ర‌మ్స్ స్పెష‌లిస్ట్ శివ‌మ‌ణి, వీణా విద్వాంసుడు రాజేష్ వైద్య‌, పియానోపై నాద‌స్వ‌ర సంగీతాన్ని అద్బుతంగా ప‌లికించి ప్ర‌పంచ ఖ్యాతి గ‌డించిన లిడియ‌న్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న.. వేడుక‌కు హాజ‌రైన వారిని ఆనంద ప‌రిచింది. ప్ర‌ముఖ హాస్య న‌టుడు బాల‌, కురైషి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అనంత‌రం న‌న్బ‌న్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌ణివ‌న్న‌న్ స్వాగ‌త ప్ర‌సంగాన్ని ప్రారంభిచారు.

‘‘వ్యాపార రంగంలో ఎంతో స‌క్సెస్‌ను సాధించిన మా న‌న్బ‌న్ గ్రూప్ ఇండియాకు ఎందుకు వ‌చ్చింది? క‌ళాకారుల‌కు అవార్డుల‌ను ఎందుకు ఇస్తున్నారు? ఇప్ప‌టికే చాలా నిర్మాణ సంస్థ‌లు ఉండ‌గా నన్బ‌న్ గ్రూప్ చిత్ర నిర్మాణ సంస్థ‌ను ఎందుకు ప్రారంభించింది? వారి ఇంకా ఏం సాధించాల‌ని అనుకుంటున్నారు? అనే సందేహాలు చాలా మందికి రావ‌చ్చు. అయితే ఆ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలు చెప్ప‌టానికి చాలా మంది వ్య‌క్తులు మీ ముందుకు వ‌స్తారు. న‌న్బ‌న్ అంటే స్నేహితుడు అని అర్థం. మ‌న‌పై ప్రేమను చూపిస్తూ సాయంగా నిల‌బ‌డుడేవాడే మ‌నకు నిజ‌మైన స్నేహితుడు. అందుక‌నే ఈ సంస్థ‌కు కూడా నన్బ‌న్ అనే పేరు పెట్టాం. క‌ళ‌లు, సాంస్కృతిక అంశాల త‌దిత‌ర విష‌యాల్లో న‌న్బ‌న్ గ్రూప్ త‌న స‌హాయ స‌హ‌కారాల‌ను అందించ‌టానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుక‌నే న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, న‌న్బ‌న్ ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర్ ట్రెజ‌రీ సెంట‌ర్ సంస్థ‌ను ఏర్పాటు చేశాం. ఈ జ‌ర్నీలో మీ అంద‌రి స‌హాయ స‌హ‌కారాలు మాకు కావాలి ’’ అన్నారు.

న‌న్బ‌న్ గ్రూపుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆరి అర్జున‌న్ మాట్లాడుతూ ‘‘స్నేహితుల కారణంగానే నేను ఈ స్థాయికి ఎదిగాను. ఆక‌లిగా ఉన్న‌ప్పుడు అన్నం పెట్టారు. ఆర్థికంగానూ సాయం చేశారు. ఇలా ఒక‌టేమిటి చాలా ర‌కాలు ఫ్రెండ్స్ స‌పోర్ట్ చేశారు. వారు చేసిన సాయానికి తిరిగి నేనెలా సాయం చేస్తానో నాకు తెలియ‌దు. ఈ సంస్థ‌ను ప్రారంభించ‌టానికి ఎంతో మంది స్నేహితులు సాయంగా నిలిచారు. వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. బిగ్ బాస్ గెలిచిన త‌ర్వాత నేనెం చేయాలి? నా బాధ్య‌త‌ల‌ను ఎలా నిర్వ‌ర్తించాలని ఆలోచించేట‌ప్పుడు న‌న్బ‌న్ గ్రూపుకి చెందిన‌ న‌రేన్ రామ‌స్వామిగారు ఇక్క‌డ‌కు తీసుకొచ్చారు. ఇక‌పై న‌న్బ‌న్ గ్రూపులోని ప్ర‌తీ స‌భ్యుడు అవిశ్రాంతంగా ప‌ని చేయ‌బోతున్నారు. నేను ఆ గ్రూపులో ఇత‌ర స‌భ్యుల‌తో మాట్లాడిన‌ప్పుడు ఆ గ్రూపు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లు లేకుండా మాన‌వత్వంతో ఎలా ప‌ని చేస్తుంద‌నే విష‌యాన్ని వాళ్లు వివ‌రించారు. న‌న్బ‌న్ అధినేత గోపాల కృష్ణ‌న్‌గారితో మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న ‘ మ‌నం నిర్విరామంగా ప‌ని చేయాలి. అలాగే మ‌నతో ఉన్న‌వారికి ఎలాంటి సాయం కావాల‌నే దానిపై కూడా దృష్టి పెట్టాలి’ అన్నారు. ఇతరులు ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచించనవసరం లేదు.

అదే విధంగా దేవుడు మ‌న‌కు కావాల్సినంత డ‌బ్బు ఇచ్చాడు. శ‌క్తి ఇచ్చాడు. వీటి వ‌ల్ల‌ మ‌న చుట్టూ ఉన్న వారికి మ‌నం ఎలా సాయ‌ప‌డాల‌నే దానిపై దృష్టి పెట్టాలి. ఇదే న‌న్బ‌న్ గ్రూప్ తార‌క మంత్రం. ఇదే సంద‌ర్భంలో నాలో త‌లెత్తిన మ‌రో ప్ర‌శ్న న‌న్బ‌న్ గ్రూప్ ఎంత కాలం కొన‌సాగుతుంద‌ని. కానీ వారు అలాంటివేం ఆలోచించ‌టం లేదు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఉద్యోగ స‌దుపాయాల‌ను క‌లుగు చేయాలి. ఎలా అంద‌రికీ మేలు చేయాలనేదే వారి ఆలోచ‌న‌. ఇలాంటివ‌న్నీ చేయాలంటే స్నేహితుల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. కాబ‌ట్టి అంద‌రం స్నేహితుల్లాగా క‌లిసి ముందుకు సాగుదాం. మూడేళ్ల త‌ర్వాత న‌న్బ‌న్ గ్రూప్ ఓ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నారు. జి.కెగారి ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఆలోచించ‌గ‌లిగే విధానం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. ఆయ‌న్ని క‌లిసిన ప్ర‌తీసారి ఆయ‌న‌లో మార్పు రానిది అదొక్క‌టే. ఆయ‌న స్వ‌చ్చ‌మైన నీళ్ల‌లాంటి వ్య‌క్తి. ఎందుకంటే నీరు ఇత‌రుల దాహాన్ని తీర్చ‌టంతో పాటు ఏ పాత్ర‌లో ఉంటే ఆ ఆకారాన్ని పొందుతుంది. ఈ న‌న్బ‌న్ గ్రూపులోజాయిన్ కావ‌టంపై గ‌ర్వంగా పీల్ అవుతున్నాను. నన్నే ఎందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్నుకున్నార‌ని నేను వారిని అడిగాను. ఈ బాధ్య‌త‌ను చాలా మంది పేరు కోస‌మో, డ‌బ్బు కోస‌మో చేస్తారు. కానీ నువ్వైతే స‌మాజం కోసం చేస్తాని వాళ్లు స‌మాధానం ఇచ్చారు. అది నాకు న‌చ్చి నేను భాగమయ్యాను’’ ’’ అని చెప్పారు.

న‌న్బ‌న్ గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడు గోపాల కృష్ణ‌న్ మాట్లాడుతూ ‘‘స‌మాజంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే వారికి న‌న్బ‌న్ గ్రూప్ ఎప్పుడూ త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. స్నేహంలోని గొప్ప‌త‌న‌మే ఈ గ్రూపుని స్టార్ట్ చేయ‌టానికి కార‌ణం. మ‌న చుట్టూ ఉన్న‌వారికి సాయంగా నిల‌బ‌డ‌ట‌మే ఈ గ్రూపు ప్ర‌ధానోద్దేశం. కులాలు, మ‌తాలు, లింగ బేదాలను ప‌ట్టించుకోదు. ప్ర‌తీ ఒక్క‌రూ ఇక్క‌డే స్నేహితులే. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ‌. ఈ గ్రూపు నుంచి న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే కొత్త సంస్థ‌ను ప్రారంభించాం. ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంపై ప్ర‌త్యేక‌మైన దృష్టి సారిస్తుంది. త‌మిళ సినిమా రంగంపై దృష్టి సారిస్తూనే ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లపై కూడా ఫోక‌స్ పెడుతుంది. టాలెంట్ ఉండి అవ‌కాశాలు లేకుండా ఇబ్బంది ప‌డే వారికి న‌న్బ‌న్ గ్రూపు స‌పోర్ట్ అందిస్తుంది. ఈ గ్రూపులో ప‌లువురు ఇన్వెస్ట్ చేయ‌టానికి ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో మేం ఎంతో చేశాం. ప‌లు విభాగాల్లో లాభాల‌ను ఆర్జించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని ముందుకు వెళ‌తాం’’ అన్నారు.

ఈ క్ర‌మంలో న‌న్బ‌న్ గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్ హెడ్ న‌రైన్ రామ‌స్వామి మాట్లాడుతూ ‘‘జి.కె గురించి చెప్పాలంటే అత‌నొక సూర్యుడిలా ప్ర‌కాశిస్తుంటే అత‌ని చుట్టూ చంద్రుడు ఇత‌ర గ్ర‌హాల్లాగా మ‌నం ఉంటాం. ప్ర‌తీ ఒక్క‌రూ వారి కాళ్ల‌పై వాళ్లు నిల‌బ‌డాలి. వాళ్ల కుటుంబం కోసం నిల‌బ‌డాలి. అలాగే ఈ స‌మాజం కోసం కూడా మ‌నం మ‌న వంతుగా సాయాన్ని అందించాల‌నేదే గోపాల‌కృష్ణ‌న్ ఆలోచ‌న‌. మేం క్రీడ‌లు, వ్య‌వ‌సాయ రంగంలో మా వంతు సేవ‌ల‌ను అందిస్తున్నాం. ఈ క్ర‌మంలో ఓసారి ఆరి అర్జున‌న్‌ని క‌లిసిన‌ప్పుడు క‌ల‌లు, సాంస్కృతికంగా ఏదైనా చేయాల‌ని ఆయ‌న అడిగారు. మ‌నం క‌ళ‌ల‌ను నిల‌బెట్టుకోలేక‌పోతే మ‌న సంస్కృతి క‌నుమ‌రుగ‌వుతుంది. మ‌న మూలాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌దే’’ అన్నారు.

న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించిన న‌టుడు నాజ‌ర్ మాట్లాడుతూ ‘‘న‌న్బ‌న్ గ్రూపుకు సంబంధించిన విష‌యాల‌ను ఆరి నాకు వివ‌రించిన‌ప్పుడు చాలా గొప్ప‌గా అనిపించింది. ఈ ప్ర‌పంచంలో స్నేహం అనేది చాలా గొప్ప బంధం. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తో సంస్థ‌ను ప్రారంభించిన న‌న్బ‌న్ గ్రూపును అభినందిస్తున్నాను. స్నేహానికి మ‌నం కొత్తగా అర్థాన్ని చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రికీ స్నేహ బాంధ‌వ్యాలుంటాయి. ఇందులో అవార్డులు సాధించిన వారంద‌రూ నా స్నేహితులే. నేను ఏం అవుతానో కూడా తెలియ‌ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ నాకు స‌పోర్ట్‌గా నిలుస్తూ వ‌చ్చారు. అలాంటి వారంద‌రి గుర్తుగా న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించ‌టాన్ని గ‌ర్వంగా భావిస్తున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో రైట‌ర్ అరివుమ‌ది, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ డి.ముత్తురాజ్‌, డైరెక్ట‌ర్ చేర‌న్ త‌దిత‌రులు పాల్గొని న‌న్బ‌న్ గ్రూపుకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా క్రాఫ్ట్ మాస్ట‌ర్స్ అవార్డ్స్‌ను డైరెక్ట‌ర్ భాగ్య‌రాజ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్, డైరెక్ట‌ర్ చేర‌న్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ డి.ముత్తురాజ్‌, డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్‌ల‌కు అందించారు. న‌న్బ‌న్ అవార్డ్స్‌ను ఆర్టిస్ట్ మ‌రుదు, ప్రొఫెస‌ర్ ము రామ‌స్వామి, ర‌చ‌యిత అరివుమ‌ది, పుర‌సై క‌న్న‌ప్ప సంబంధం, పెరియ మేళం క‌లైంగ‌ర్ మునుస్వామిల‌కు త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి ప్రెసిడెంట్ తెన్నాండాల్ ముర‌ళీ రామ‌స్వామి అందించారు. ఆయ‌న‌తో పాటు నడిగ‌ర్ సంఘం ప్రెసిడెంట్ నాజ‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ కూడా అవార్డుల‌ను అందించారు.

న‌న్బ‌న్ టాలెంట్ గేట్ వే అవార్డుల‌ను గ‌ణేష్ కె.బాబు, విఘ్నేష్ రాజా, వినాయ‌క్ చంద్ర‌శేఖ‌రన్‌, ముత్తుకుమార్, అరివు మ‌ద‌న్ అందుకున్నారు. అవార్డ్ విన్న‌ర్స్‌కు ఒక ల‌క్ష రూపాయ‌ల‌ను చెక్‌ను అందించారు.