నెట్టింట వైరల్ అవుతోన్న సమంత పోస్ట్!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎన్ని చెప్పినా తక్కువే. తాజాగా తన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది! ఒక్క రిమార్కు లేకుండా ఎంతో హుందాగా వ్యవరిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకుంది. తన నిజ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ధైర్యంగా నిలబడింది.

ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి ఒంటరి పోరునే సాగిస్తోంది! పోరాటమే ఆయుధంగా మలచుకుంటోంది! ఇలాంటి కష్టాల్లో కూడా ఎక్కడా తగ్గకుండా తన పాత్రని సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అందరి చేత మరింత అభిమానాన్ని పొందుతోంది! మోడలింగ్ లో పేరుతెచ్చుకున్నాక వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదే సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్యను తన జీవిత భాగస్వామి చేసుకుని అక్కినేని వారింట్లో అడుగుపెట్టి కెరీర్ పరంగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది! చైతూతో పెళ్లి తర్వాత సమంతలో జోష్ మరింత రెట్టింపయింది.

వరుస అవకాశాలను తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఉన్నత స్థితిలోకి ఎదిగింది. పలు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. భర్త చైతూకు జోడీగానూ నటించింది. తెలుగు చిత్రసీమలో సూపర్ జంటగా అందరి నోళ్లలో నానారు. ఇలాంటి మంచి తరుణంలోనే ఓ చేదువార్త బాగా దావానంలా వ్యాపించింది. అదే.. చైసామ్ డివోర్స్ మ్యాటర్! ఒక్కసారిగా చిత్రసీమతో పాటు అక్కినేని అభిమానులు ఈ న్యూస్ విని కలవరపడ్డారు. సోషల్ మీడియా అయితే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది.. పోస్టులమీద పోస్టులుపెడుతూ నెటిజనులు వీరావేశం చేశారు.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత ధైర్యాన్ని తెచ్చుకుంది. తన దారిని రహదారిలానే మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. సినిమా కెరీర్ పైనే పూర్తి దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే ‘మాయోటైటిస్’ అనే అరుదైన వ్యాధి రూపంలో సమంతకు మరో కష్టం వచ్చిపడింది. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు.

ఈ ‘మాయోటైటిస్’ వ్యాధి నుంచి త్వరలోనే కోలుకొని మీ అందరినీ అలరిస్తా అని చెప్పి.. తన అభిమానుల్లో నెలకొన్న నిరాశను తుడిపేసింది. సమంతకు ఫ్రెండ్‌షిప్ అంటే ఎంతో ఇష్టం. ఏ మాత్రం సమయం దొరికినా తన స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు కొడుతూ ఉంటుంది. సామ్ స్నేహితుల లిస్టులో చిన్మయి భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ ఒకరు.

తాజాగా సమంతకు రాహుల్ రవీంద్రన్ ఓ ఫొటోను బాహుమతిగా ఇస్తూ.. ఆ ఫొటోలో ఓ సందేశాన్ని రాశారు. దీంతో సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను షేర్ చేస్తూ రాహుల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే మరింత బలంగా తిరిగి వస్తానని పేర్కొంది సామ్.

”ప్రస్తుతం నీ మార్గం చీకటిగా ఉండొచ్చు. కనుచూపు మేరలో వెలుతురు ఆనవాళ్లు లేకపోవచ్చు. అయినప్పటికీ నీకున్న శక్తితో నువ్వు ముందుకు సాగగలవు. ఎందుకంటే నువ్వు ఉక్కు మనిషివి. ఈ బలహీనతను జయించడం అనేది నీ జన్మహక్కు. ఇప్పుడు చీకట్లో నడుస్తున్నప్పటికీ త్వరలోనే ప్రకాశిస్తావు. ఓ యోధురాలివి నువ్వు.

ఇలాంటి కష్టాలు నిన్ను మరింత బలపరుస్తాయి” అని రాహుల్ రవీంద్రన్ సదరు ఫొటో గిఫ్ట్ ద్వారా తెలిపారు. అయితే ఇదే పిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న సమంత.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితం అని తెలిపింది. పోరాడుతూనే ఉండండి.. అదే మీ బలం.. అప్పుడే గతంలో కంటే ఎంతో బలంగా తయారవుతారు అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది.

సమంత నటించిన ‘యశోద’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. త్వరలోనే ‘శాకుంతలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో కూడా నటిస్తోంది. రాబోయే సినిమాలన్నీ కూడా సమంత కెరీర్ లో గొప్ప మైలురాళ్లే అవుతాయని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి.