ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ‘అవతార్’కు సీక్వెల్’గా వచ్చిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా అలరిస్తోంది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన మరో ప్రపంచం ఈ ‘అవతార్’. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2డి, 3డి లలో ఈ చిత్రం విడుదలయింది.
ఈ సినిమాకు తెలుగు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రాష్ట్రాల్లో తొలిరోజే పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, అయిదు రోజుల్లో 47 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ‘అవతార్ 2’ ఇంగ్లీష్ సినిమా కాబట్టి ఇది చాలా పెద్దది. వర్కింగ్ డేస్ కావడం తో మార్నింగ్ షోలు నిదానంగా ప్రారంభమైనా, డే అంతా మంచి హోల్డ్ ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా నైజాం, ఏపీలోని ఏ సెంటర్లలో సినిమా మంచి వసూళ్లను రాబట్టడమేగాక, లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించే దిశగా పరుగెడుతోంది. .హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సినిమాను సినీ ప్రియులెవరూ మరిచిపోలేరు.
దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’కు సీక్వెల్గా వచ్చిన సినిమానే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. భారత్‌లోనూ భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర ‘అవతార్ 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగులు తీస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హాలీవుడ్ నుండి ఇక్కడ విడుదలయిన ఏ సినిమా కూడా సాధించని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’. ఇప్పుడు ఏ సినిమా క్రియేట్ చేయని 50 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మరోసారి అంచనాలను అందుకుని 4.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా, అన్ని వర్షన్స్ కలిపి అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా 50 కోట్ల మార్క్ ని అందుకుంది అవతార్ 2.
‘అవతార్ 2’ సినిమా ఐదు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు ఓ సారి చూస్తే… నిజాంలో 24.95కోట్లు. సీడెడ్ 5.70కోట్లు, ఆంధ్రాలో 16.05 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఏపీ తెలంగాణలో కలిపి 46.70కోట్లు గ్రాస్ రాబట్టింది. మొత్తం మీద అవతార్ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను 58 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సెకెండ్ వీకెండ్ లో హోల్డ్ చేస్తే సినిమా 70 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.