లాస్ ఏంజిల్స్‌లో ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న అభిమానుల‌ను క‌లుసుకోవ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ప్ర‌త్యేక‌ సంద‌ర్భాల్లో రామ్ చ‌ర‌ణ్‌ను క‌లుసుకుని మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న అభిమానులు సైతం ఊహ‌ల్లో తేలిపోతుంటారు. వారి ఆనందాన్ని వెల‌క‌ట్ట‌లేం. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్‌స్టార్ యు.ఎస్‌.ఎలో జ‌ర‌గనున్న‌ ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొన‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

RRR ఈవెంట్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. అంత బిజీ షెడ్యూల్‌లోనూ రామ్ చ‌ర‌ణ్‌ లాస్ ఏంజిల్స్‌లో త‌న అభిమానుల‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. త‌నపై అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల‌ను ప్రత్య‌క్షంగా ఫీల్ అయ్యారు. అమెరికా వేర్వేరు రాష్ట్రాల్లోని అభిమానులు ఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన ఫ్యాన్స్ మీట్ గ్రీట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అమెరికాలోని ప‌లు ఫ్యాన్స్ గ్రూప్స్ ఆధ్వ‌ర్యంలో లాస్ ఫెలిజ్ బ్లెవ్డ్ వేదిక‌గా ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ జ‌రిగింది. పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో అమెరికాలోని మెగా అభిమానుల సంఘాల ప్రతినిధులు రాంచరణ్ ను వేదికపై ఆహ్వానించారు.

ఫ్యాన్స్ ఆనందం, వారు రిసీవ్ చేసుకున్న తీరు, ప్రేమాభిమానాలు, ఆద‌ర‌ణ ఓ పాజిటివ్ వైబ్రేష‌న్స్‌ను క్రియేట్ చేశాయి. ఇదే ఈవెంట్‌లో అభిమానులు త‌మ హీరోతో మాట్లాడే అవ‌కాశం ద‌క్కింది. అంతే కాకుండా ఆయ‌న‌తో క‌లిసి వారంద‌రూ ఫొటోలు దిగారు. ఎంతో ఇష్ట‌ప‌డే హీరోని ద‌గ్గ‌ర‌గా చూసిన‌ప్పుడు క‌లిసిన‌ప్పుడు వారిలో ఎమోష‌నల్ లెవ‌ల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్బంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం సులభంగా ఉంటుంది. కానీ అమెరికాలో ఎంత కష్టమో నాకు తెలుసు. మా మీదున్న అభిమానంతో అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి విమానాలు, కార్లలో ఇలా చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కిడికి వచ్చిన అభిమానులు అందరికీ కృతజ్ఞత చెప్పడం చాలా చిన్నది అవుతుంది. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా. ఇలా అభిమానించే వాళ్లను కలిసినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ వేదిక ఇంతమంది అభిమానులను కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వేదికను ఏర్పాటు చేసిన మెగా అభిమానులు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ఈ అభిమానం చూస్తే సినిమాల్లో ఇంకేదో చేసి మిమ్మల్ని మెప్పించాలనే కసి పడుతుంది. మీ ఆధారాభిమానాల వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను’’ అని అన్నారు. ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ కావటంపై రామ్‌చరణ్‌ స్పందించారు. ‘‘ఓ ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా వాడిగా కాదు.. తెలుగువాడిగా, భారతీయుడిగా మనమంత ఓ చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ హిస్టరీలో మీరంతా కూడా భాగమే! ఈరోజు దాని విలువ మనకు తెలుసో, లేదో చెప్పలేం కానీ, రానున్న రోజుల్లో అంటే ఓ పదేళ్ల తర్వాత అయినా ఈ రోజులు విలువేంటో తెలుస్తుంది(ఆస్కార్‌ను ఉద్దేశించి). మంచి సినిమాకు పెట్టుబడిగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ వాల్యూ అర్థమవుతుంది.

అలాగే చరణ్‌ రీసెంట్‌గా తాను ఎంజాయ్‌ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ గురించి కూడా మాట్లాడారు. అదే సందర్భంలో జనవరిలో తన తండ్రి చిరంజీవి జూమ్‌ కాల్‌లో ఇక్కడి అభిమానులతో ముచ్చటించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. విరాళాలను సేకరించి మంచి పనులకు ఉపయోగించటంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేయటానికి వేర్వేరు డ్రైవ్‌లను నిర్వహిస్తునందుకు అభిమాన సంఘాలను అభినందించారు చరణ్‌.

అభిమానులంటే త‌న‌కెంతో ఇష్ట‌మో, వారితో ఎంత ప్రాణ‌ప్ర‌దంగా ఉంటాన‌నే విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ త‌న మాట‌ల్లో వ్య‌క్తీక‌రించారు. అభిమానులున్న ప్ర‌తీ టేబుల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మరీ వారితో ఫొటోలు దిగారాయ‌న‌. ఇంతటి మ‌ర‌పురాని జ్ఞాప‌కాల‌ను త‌మ‌కు అందించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు యు.ఎస్‌.ఎలోని మెగా ఫ్యాన్స్ అసోసియేష‌న్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది.