సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ముత్తు డిసెంబర్ 2 న గ్రాండ్ రీరిలీజ్

ఇప్పుడంతా 4 కె రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అప్పట్లో ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు అభిమానులు రీరిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు ఆయన అభిమానులు. డిసెంబర్ 12 న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ముత్తు చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లో బ్రహ్మాండంగా ముత్తు విడుదలకు సిద్ధం అయింది.

తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు మొదటి వరుసలో ఉంటుంది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ముత్తులో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 23, 1995 న విడుదలైన ఈ చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది. తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. మన దగ్గర సంచలనం సృష్టించిన ముత్తు 1998 లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా దాదాపు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్ లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2 న రీ రిలీజ్ అవుతుండంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.