‘పుష్ప’ వర్సెస్‌ ‘దేవర’!

ఇద్దరు సూపర్‌ హీరోల సినిమాలు పోటీపడి విడుదలవుతుంటే… అభిమానుకలు పండగే. వచ్చే వేసవి లక్ష్యంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ , ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ల చిత్రాలు పోటీ పడబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి. ఈ వార్త మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి సందడిచేసేదిగా ఉంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ’పుష్ప2’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అలాగే ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ’దేవర’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేకర్స్‌ తీసుకున్నారు. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే నెలలో వస్తున్నాయనే న్యూస్‌.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.2024 ఏప్రిల్‌ 5న ’దేవర’ ఆగమనం ఉంటుందని ఆల్రెడీ ప్రకటించేశారు కూడా. అల్లు అర్జున్‌ ’పుష్ప2’ కూడా అదే టైమ్‌లో ఒకటి లేదా రెండు వారాల గ్యాప్‌తో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందనేలా ప్రస్తుతం టాక్‌ నడుస్తుండటంతో.. సోషల్‌ విూడియాలో ’పుష్పరాజ్‌’ వర్సెస్‌ ’దేవర’.. ’చూసుకుందాం’.. అనేలా ఇరు హీరోల ఫ్యాన్స్‌ ఆసక్తికరంగా చర్చలు కొనసాగిస్తున్నారు.

’పుష్ప’ సినిమా అల్లు అర్జున్‌కి ఇంటర్నేషనల్‌ క్రేజ్‌ వచ్చేలా చేసిందీ చిత్రం. దీంతో ఈ సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. ఈ సీక్వెల్‌ను సుకుమార్‌ అంతే భారీగా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చిన ’వేర్‌ ఈజ్‌ పుష్ప’ వీడియో కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను డబుల్‌ చేసింది. రష్మిక మందన్నను ఈసారి ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ, ఈ పార్ట్‌లో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ రోల్‌ ఎలా డిజైన్‌ చేస్తున్నారో అనే ఎగ్జయిట్‌మెంట్‌.. అన్నీ ఒకవైపు అయితే.. ’పుష్పరాజ్‌’గా బన్నీ ఏ రేంజ్‌లో చెలరేగనున్నాడో అనేది.. ఈ సినిమా గురించి నిత్యం మాట్లాడుకునేలా చేస్తోంది.

ఇక ’దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్‌ ఏ విధంగా కసరత్తులు చేస్తున్నారో.. కొన్ని వీడియోలు సోషల్‌ విూడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియో గ్లింప్స్‌తో.. ఇందులో రాక్షసులను భయపెట్టే యోధుడిగా యంగ్‌ టైగర్‌ కనిపించబోతున్నారనే విషయం తెలుస్తోంది. దర్శకుడు కొరటాలకు కూడా ఈ సినిమా ఎంతో కీలకం. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో పాటు.. భారీ బ్జడెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ’ఆర్‌ఆర్‌ఆర్‌’తో వచ్చిన క్రేజ్‌ని అందుకునే విధంగా.. ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనే వార్తలు.. నందమూరి ఫ్యాన్స్‌కి యమా కిక్కిస్తున్నాయి.