పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రం నుంచి ఎనర్జిటిక్ టీజర్ విడుదల

విజయవంతమైన చిత్రాలతో అతికొద్ది కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వారు తదుపరి చిత్రం కోసం జీ స్టూడియోస్ తో చేతులు కలిపారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

టైటిల్ మోషన్ పోస్టర్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ద్వయం పోస్టర్ సహా ‘బ్రో’ చిత్రం నుండి విడుదలైన ప్రతి ప్రచార చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రంలోని ప్రధాన తారలు నటించిన పవర్ ప్యాక్డ్ టీజర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.

చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అతను వారిని ‘మాస్టర్’, ‘గురు’, ‘తమ్ముడు’ అని రకరకాలుగా సంబోధిస్తాడు. చివరకు ‘బ్రో’ అని పిలుస్తాడు. ఆ తర్వాత పెద్ద ఉరుము పవన్‌ కళ్యాణ్ రాకకు స్వాగతం పలుకుతుంది. ‘తమ్ముడు’ సహా తన ఇతర హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ, టీ గ్లాస్ పట్టుకుని, పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఓం లాకెట్ ధరించి, మనోహరమైన చిరునవ్వుతో కనిపించారు. ఆ తర్వాత కూలీ దుస్తులు ధరించి ‘కాలం మీకు అంతు పట్టని ముడి జాలం’ అంటూ సాయి ధరమ్ తేజ్‌కి స్వాగతం పలికారు. అల్లరిగా కనిపించే సాయి ధరమ్ తేజ్‌తో ఆయన సరదాగా ఆడుకుంటారు. గిటార్ పట్టుకుని పార్టీలో డ్యాన్స్ చేయడం నుండి స్టార్‌ల మధ్య హాస్య సంభాషణల వరకు అభిమానుల చేత విజిల్ వేయించే అద్భుతమైన మూమెంట్స్ టీజర్ లో ఎన్నో ఉన్నాయి.

‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ కారులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ని ముగించిన తీరు బాగుంది. సినిమాలో వినోదానికి కొదవ లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ప్రధాన అంశాన్ని రివీల్ చేయకుండానే, టీజర్ ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు.

ఎస్ థమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతం, అందమైన విజువల్స్ మరియు పవన్ కళ్యాణ్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో.. జూలైలో వెండితెరపై విందు ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తుంది టీజర్. ఇందులో టైటిల్ పాత్రధారి ‘బ్రో’గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు.

టీజర్ లాంచ్‌తో, రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాలను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తన మేనల్లుడితో పవన్ కళ్యాణ్ నటిసున్న మొదటి సినిమా కావడంతో ‘బ్రో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ, ఆధ్యాత్మికత అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వి రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా మరియు సూర్య శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్