Pawan Kalyan: సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడా గొప్ప నాయకుడిగా పేరు పొందారు. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం కేటాయించలేకపోయారు. సమాజ సేవ పట్ల పవన్ కళ్యాణ్ నిబద్ధతను అర్థం చేసుకున్న చిత్ర నిర్మాతలు, ఆయన భాగంకాని ఇతర సన్నివేశాల చిత్రీకరణ మరియు చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని, వీలు చూసుకొని షూటింగ్ కోసం తగు సమయం కేటాయిస్తానని మాట ఇచ్చారు. తన మాటకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు.
‘బ్రేవ్‌హార్ట్’, ‘గ్లాడియేటర్’, ‘బోర్న్ ఐడెంటిటీ’, ‘ది లాస్ట్ సమురాయ్’, ‘రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్’ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.
నిక్ పావెల్ తన అసాధారణ నైపుణ్యంతో ‘హరి హర వీర మల్లు’ యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు.
సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, యువ దర్శకుడు జ్యోతికృష్ణ.. చిత్రీకరణ, నూతన తారాగణం, సాంకేతిక సిబ్బంది చేరిక వంటి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే ఆయన విడుదల చేసిన టీజర్, ఈ చిత్రంపై అంచనాలను మరింత పెరిగేలా చేసింది.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.