Ishq : టాలీవుడ్ హీరో నితిన్ కథానాయకుడిగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ‘ఇష్క్’. 2012లో ఫిబ్రవరి 14న విడుదలైన ఈ రొమాంటిక్ మూవీని తెలుగు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన తీరుని ఇప్పటికీ ఆడియెన్స్ మరచిపోనంత ఆదరణను దక్కించుకుంది. అలాగే రాహుల్ పాత్రలో నటించిన నితిన్, ప్రియ పాత్రలో నటించిన నిత్యా మీనన్ మధ్య కెమిస్ట్రీ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.
ఇప్పుడీ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ఇష్క్‌ను నవంబర్ 30న ఏపీ, తెలంగాణ, బెంగుళూరుల్లో 65కి పైగా థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయగా అన్నిచోట్ల హౌస్‌ఫుల్ కావటం.. అలాగే ఈ సినిమాతో పాటు చాలా కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావటం విశేషం. సినిమాలోని చక్కటి కామెడీ, సునిశితమైన ప్రేమకథను, అనూప్ రూబెన్స్ సూపర్బ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయటానికి ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టారు.
హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ కె.కుమార్, నిర్మాత సుధాకర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్‌కు వెళ్లి అక్కడ ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయటమే కాకుండా మూవీలోని ఓ పాటకు ఆడియెన్స్‌తో కలిసి డాన్స్ కూడా చేశారు. ఇప్పుడు ఈ సినిమాను చూడటానికి ఆడియెన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు. అందుకు కారణం ఈ రొమాంటిక్ బ్లాక్ బస్టర్‌ను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసి ఆ క్షణాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే బెస్ట్ రీ రిలీజ్.
ఇష్క్ చిత్రాన్ని రాయటంతో పాటు విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేశారు. కథ విషయానికి వస్తే.. రాహుల్ (నితిన్), ప్రియ(నిత్యా మీనన్) అనుకోకుండా ఎయిర్ పోర్టులో కలుసుకుని ప్రేమలో పడతారు. అయితే ప్రియ సోదరుడు (అజయ్) వారి ప్రేమకు నిరాకరిస్తాడు. అందుకు కారణం రాహుల్ వల్ల అజయ్ ఓ సమస్యను ఎదుర్కొని ఉంటాడు. అయితే రాహుల్, ప్రియ.. అజయ్‌ను ఒప్పించి తమ ప్రేమను ఎలా సక్సెస్ చేసుకుంటారనేది సినిమా. సినిమాలోని కామెడీ, అనూప్ రూబెన్స్ చార్ట్ బస్టర్ సాంగ్స్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది.
ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ మూవీ మహాశివరాత్రికి విడుదలకానుంది.