Saiyaara: యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సయ్యారా’. YRF బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సయ్యారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు.
రీసెంట్‌గా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి 2025లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే రొమాంటిక్ మూవీగా మారింది సైయారా. ఓ వైపు మోహిత్ సూరి, మరోవైపు యష్‌రాజ్ ఫిల్మ్స్ ..ఇద్దరూ అద్భుతమైన ప్రేమకథలను రూపొందించటంలో సుప్రసిద్ధులు. వీరిద్దరి కలయికలో ఇప్పుడు వస్తున్న ప్రేమకథా చిత్రం సైయారా కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
ఈరోజున యష్‌రాజ్ ఫిల్మ్స్‘సయ్యారా’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్‌ను విడుదల చేసింది. ఐదేళ్ల నుంచి ఎంతో జాగ్రత్తగా సేకరించి, శ్రద్ధగా రూపొందించిన పాటలు, ఆలోచనలు, స్వరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని డైరెక్టర్ మోహిత్ సూరి పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నాకు ఎంతో దగ్గరైన స్నేహితులకు మాత్రమే తెలిసిన విషయమేమంటే నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్‌ని కలవటానికి ఇష్టపడుతుంటాను. పుస్తకాలను ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు పుస్తకాలను ఎలాగైతే సేకరిస్తారో నేను అలాగే పాటలను, స్వరాలను సేకరిస్తుంటాను.
సయ్యారా సినిమా విషయానికి వస్తే నేను ఐదేళ్లుగా సేకరించిన పాటలు, ఆలోచనలు, స్వరాలన్నీ ఈ ఆల్బమ్‌లో ఉన్నాయి. మనసుని తాకేలా, సరికొత్త, ఆహ్లాదకరమైన ఆల్బమ్‌ను సయ్యారా సినిమాతో అందించాలనుకుంటున్నాను. కొత్తవారితో చేస్తున్న ఈ సినిమాలో పాటలన్నీ.. సరికొత్త రొమాంటిక్ ఆల్బమ్‌ను సిద్ధం చేయాలనుకుని చేసినవే. ఈ పాటలు నా హృదయానికెంతో దగ్గరైనవి. ప్రతీ పాట నాకెంతో ప్రత్యేకమైనది. ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా సయ్యారా టైటిల్ ట్రాక్‌ను విడుదల చేశాం. ఈ పాటలో ప్రేమ, ఆర్ద్రత, ఓ ఆత్మ ఉంటుంది. ఈ పాటతో నేను వెంటనే ప్రేమలో పడ్డాను.
సయ్యారా టైటిల్ ట్రాక్‌తో పాటు ఫహీమ్ అబ్దుల్లా, అర్సలాన్ నిజామి అనే ఇద్దరు అత్యంత ప్రతిభావంతమైన భారతీయ సంగీత దర్శకులు, గాయకులను (కాశ్మీర్ నుండి) బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాం. ఈ ట్రాక్‌ను ప్రతిభాశాలి తనిష్క్ బాగ్చీ స్వరపరిచారు. ఫహీమ్, అర్సలాన్‌ను పరిచయం చేసినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇర్షాద్ కామిల్ ఈ పాటకు అందమైన సాహిత్యాన్ని అందించారు. సయ్యారా మొదటి పాటపై పని చేసిన వాళ్లంతా అద్భుతమైన ప్రతిభ కలిగిన కళాకారులు. మనం అందరికీ చాలా కాలం గుర్తుండిపోయే ఒక మధురమైన ప్రేమ పాట అందిస్తున్నామనే ఆశతో ఉన్నాం
‘సయ్యారా’ చిత్రంతో హిందీ చిత్రసీమకు అహాన్ పాండే హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే ప్రశంసలు అందుకున్న వెబ్ సిరీస్ ‘బిగ్ గ్రిల్స్ డోంట్ క్రై’లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న అనీత్ పడ్డా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విద్యానీ నిర్మించారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.