శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా ఇది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఆయనతో మా సంస్థలో మూడో చిత్రమిది. ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల వంటి హేమాహేమీలు ఈ కథలో భాగం అయ్యారు. హీరోయిన్ రూప కొడువాయూర్, వడ్లమాని శ్రీనివాస్, రూపాలక్ష్మి, కల్పలత లు కూడా మంచి పాత్రలు చేశారు. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వివేక్ సాగర్ అద్భుతమైన బాణీలు అందించారు. సంగీతానికి సినిమాలో మంచి ప్రాముఖ్యం ఉంది. మా సంస్థలో 15వ చిత్రమిది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’, ‘యశోద’ – హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.
సారంగపాణి జాతకం’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో చెప్పాం. హీరో పాత్రలో భావోద్వేగాలను, వినోదాన్ని ప్రియదర్శి తనదైన శైలిలో అద్భుతంగా పండించగా… అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ తన అభినయంతో కట్టి పడేస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా చూడగలిగే ఒక హాస్య సంబరం ఈ సినిమా. ఉన్నత సాంకేతిక ప్రమాణాలు అందించే శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. పీజీ విందా ఛాయాగ్రహణం, వివేక్ సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ కూర్పు, రవీందర్ కళా దర్శకత్వం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయి” అని చెప్పారు.
తారాగణం: ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్.
సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.