వినోదంగా సాగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’!

మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడం.. ’జాతిరత్నాలు’ వంటి విజయం తర్వాత నవీన్‌ పోలిశెట్టి చేసిన సినిమా కావడం.. నిర్మాణంలో రాజీ అంటూ తెలియని యూవీ క్రియేషన్స్‌వాళ్లు నిర్మించిన సినిమా కావడం.. ఈ కారణాలవల్ల ఈ సినిమాపై నిర్మాణంలోవున్నప్పట్నుంచీ అంచనాలు పెరిగాయి. నాన్నకు దూరమై బాధపడుతున్న అమ్మతో కలిసి పెరిగిన కూతురు అన్విత. ఈ కారణం చేత తనకు పెళ్లిపై సదాభిప్రాయం ఉండదు.

పెళ్లి చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా అన్విత మాత్రం ఒప్పుకోదు. ఓరోజు తనకు తల్లి కూడా దూరమవుతుంది. ఉన్న ఒక్క తోడు దూరమవ్వడంతో అన్విత ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, బయటనుంచి వచ్చే ఆ ప్రేమలో నిజం ఉంటుందో ఉండదో!? అనే భయం, అనుమానం. అందుకే అమ్మలేని లోటును అమ్మ అయ్యి తీర్చుకోవాలనుకుంటుంది. పెళ్లితో, శారీరక సంబంధంతో నిమిత్తం లేకుండా వైద్య సహాయంతో తల్లి కావాలని నిర్ణయించుకుంటుంది. తన నిర్ణయాన్ని గౌరవించి, సహకరించే వ్యక్తి కోసం వెతుకుతుంది.

ఆ ప్రయత్నంతో తనకు స్టాండప్‌ కామెడీ చేసుకునే సిద్దూ తారసపడతాడు. విషయం చెప్పకుండా అతనితో స్నేహం చేస్తుంది. అతనేమో అన్వితను ప్రేమిస్తాడు. అన్వితకు కావాల్సింది కేవలం సిద్దూ స్పెరమ్‌. సిద్దూకి కావాల్సింది అన్విత. మరి తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

జీవితం ఒక్కసారి చేదుని రుచిచూపిస్తే.. ఇక ఎదురయ్యే ప్రతి అనుభవం చేదుగానే ఉంటుందేమోనని భ్రమించే ఓ అమ్మాయి కథ ఇది. వివాహబంధం పేరుతో బయటనుంచి వచ్చే ప్రేమను నమ్మలేక తనలో తానే ప్రేమను వెతుక్కోవాలని తాపత్రయపడే ఓ అమాయక కూతురు కథ ఇది.. మొత్తంగా ఇది అన్విత కథ. సినిమా కథ పరంగా ప్రధాన పాత్ర అనుష్కది.

ప్రధాన బలం మాత్రం నవీన్‌ పొలిశెట్టి. ఓ విధంగా అతనికిది టైలర్‌మేడ్‌ కేరక్టర్‌. దానికి తగ్గట్టే తనది స్టాండప్‌ కమెడియన్‌ పాత్ర కావడంతో సినిమా ఆద్యంతం నవ్విస్తూ అద్భుతంగా ఎంటర్‌టైన్‌ చేశాడు. ఒక్కసారి పరిచయమైతే వదులుకోలేని వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వ్యక్తిగా కనిపిస్తాడు ఇందులో నవీన్‌ పోలిశెట్టి. సినిమా మొత్తాన్ని వీరిద్దరే భుజాలపై మోశారని చెప్పాలి. న

వీన్‌ తండ్రిగా మురళీశర్మ కూడా బాగా మెరిశాడు.ఈ జనరేషన్‌కి తగ్గ మంచికథ ఇది. ప్రథమార్థం వినోదంతో అప్పుడే అయిపోయిందా? అనిపించింది. ద్వితీయార్థం మాత్రం కథ సీరియస్‌ మోడ్‌లో సాగడంచేత కాస్త నిదానించినట్లు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా మాత్రం బావుందన్న టాక్‌ వచ్చింది.