టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ మెగాస్టార్ చిరంజీవి అతిథిగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార్యక్రమంలో
సినిమాటోగ్రాఫర్ ఎంఎన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ – ఈ కార్యక్రమానికి వచ్చిన మెగాభిమానులకు థాంక్స్. మా బేబీ సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకుల థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సినిమాకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ – చిరంజీవి గారు మా ఫంక్షన్ కు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ముందు మాట్లాడలేనని ముందే పిలిచేయమని చెప్పా. గతంలో నేను మ్యూజిక్ చేసిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ కి మెగాస్టార్ అభినందన దక్కింది. ఇప్పుడు ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భాన్ని మర్చిపోలేను. అన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ – ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మా రాజేష్ అన్న నన్ను నటుడిగా నిలబెట్టిన దర్శకుడు. ఆనంద్ , విరాజ్, వైష్ణవి అందరికీ ఇంకా మరిన్ని సక్సెస్ లు రావాలని కోరుకుంటున్నా. నన్ను ఈ కార్యక్రమానికి పిలవడమే ఆనందంగా ఉంది. అన్నారు
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ -మా సినిమాను హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. ఇవాళ మా జీవితంలో మర్చిపోలేని రోజు. టాలీవుడ్ కు గాడ్ ఫాదర్ లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు మా బెేబీ సినిమా నచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానకిి రావడం ఎప్పటికీ గుర్తుంటుంది. శివశంకర వరప్రసాద్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు మీ జర్నీ ఎంతోంమదికి ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది. మీ లైఫ్, మీ సినిమాలు నన్నెంతో ఎంకరేజ్ చేస్తుంటాయి. ఇవాళ మీ ముందు నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది బేబీ టీమ్ వల్ల. దర్శకుడు సాయి రాజేష్ కు థాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ కథ రాసి అంతే అందంగా తెరకెక్కించకపోతే మేము ఇవాళ ఇక్కడ ఉండేవాళ్లం కాదు. మా తాతయ్య కేఏ మార్తాండ్ గారు, మామయ్యలు మార్తాండ్ కె వెంకటేష్ గారు, శంకర్ మార్తాండ్ గారు మీ చేతుల మీదుగా షీల్డ్స్ తీసుకున్నారు. నా సినిమా ఈవెంట్ కు కూడా మీరు రావడం గర్వంగా ఉంది. అన్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – లైఫ్ లో మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకున్నా. ఆయన మేము నటించిన సినిమా సక్సెస్ మీట్ కు రావడం కల నిజమైనట్లు ఉంది. ఆయన పాటకు ఒకసారి కవర్ సాంగ్ చేస్తే లక్షల వ్యూస్ వచ్చాయి. అలాంటి క్రేజ్ మెగాస్టార్ ది. ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెల్లో ఉంటారు చిరంజీవి గారు. ఆయనకు మా టీమ్ తరపున హార్ట్ ఫుల్ గా థాంక్స్ చెబుతున్నా. మనం కష్టపడి సినిమా చేశాక ప్రేక్షకుల ఇచ్చే లవ్ చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. తెలుగు అమ్మాయిలు సందేహం లేకుండా ఇండస్ట్రీలోకి రండి. మీకు అవకాశాలు ఇచ్చేవాళ్లు ఉంటారు. అని చెప్పింది.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – బేబీ సినిమా హిట్ అవడానికి మూడు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఛాలెంజింగ్, టాలెంటెడ్ టీమ్ ను ఒక దగ్గరకు తీసుకొచ్చి సినిమాకు పెట్టిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. రెండోది మా డైరెక్టర్ సాయి రాజేష్. మూడోది సినిమా బాగుంటే ఎలాంటి రీజన్స్ చూడకుండా సక్సెస్ చేసే ప్రేక్షకుల ప్రేమ. బలగం, సామజవరగమన, బేబీ..ఇలాంటి చిన్న సినిమాలన్నీసూపర్ హిట్స్ చేశారు. సాయి రాజేష్ రేపటి రోజున కాబోయో స్టార్ డైరెక్టర్. అది బేబీ సినిమా నుంచే మొదలైంది. నిన్న బేబీ, ఇవాళ బ్రో, రేపు రాబోయో భోళా శంకర్ తో ఇంకో పెద్ద పండగ వస్తోంది. అన్నీ బి లెటర్ ఫాలో అవుతున్నాయి. నేను హాస్టల్ లో చదువుకోవడం వల్ల ఎక్కువగా సినిమాలు చూసే వీలుండేది కాదు. అయితే హాలీడేస్ కు వచ్చినప్పుడు మీ సినిమాను చూపించమని డాడీతో గొడవచేసి ఏడ్చేవాడిని. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఒక ఇన్సిపిరేషన్ అనిపించేది. ఇవాళ మా ఫంక్షన్ కు వచ్చి మా మధ్యలో కూర్చుని ఉన్నారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతో హ్యాపీగా ఉంది. విజయ్ అన్న, బన్నీ అన్న మా ఫంక్షన్ కు వచ్చాడు. అల్లు అర్జున్ అన్న కొద్దిసేపు మాతో మాట్లాడారు. ఇవాళ మా మధ్య మెగాస్టార్ ఉన్నారు. ఇంతకంటే పెద్ద సపోర్ట్ మాకు దక్కుతుందా. చిరంజీవిగారికి థాంక్స్. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడూ గర్వపడుతుంటా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారిని కలిస్తే చాలనుకున్నా. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వస్తుంటే చిరంజీవిగారు వస్తున్నారు అని చెప్పారు. మేము బలంగా అనుకుంటే మీరు తప్పకుండా కలుస్తారు. బేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మీరు రావాలని, వస్తారని అనుకున్నాం. అప్పుడు యూఎస్ లో ఉన్నారు. కానీ మేము గట్టిగా నమ్మాం మమ్మల్ని బ్లెస్ చేసేందుకు మీరు వస్తారని. ఇవాళ సక్సెస్ మీట్ కు వచ్చారు. అభిమానులుగా మేము బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తొచ్చేది మీరే, వినేది మీ పాటే. అది అమెరికా అయినా, చిన్న ఊరిలో ఆటోవాలా అయినా మీ సినిమాలు, మీ పాటలే అసలైన కిక్కు. ఇవాళ మిమ్మల్ని ఈ ఫంక్షన్ లో చూస్తుంటే ఎన్నో మెమొరీస్ గుర్తొస్తున్నాయి. మనస్ఫూర్తిగా మెగాస్టార్ కు థాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – మంచితనం ఒక శిఖరం అయితే మెగాస్టార్ ఎవరెస్ట్ లాంటి వారు. ఆయనను కామెంట్ చేసిన వారిని కూడా దగ్గరకు తీసే స్వభావం చిరంజీవి గారిది. ఆయన చేసే సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ గురించి కామెంట్ చేసేవారు ఉంటారు. వాళ్లకు ఈ మధ్యే జైలు శిక్ష పడింది. సోషల్ మీడియా వచ్చాక మా ఫ్యాన్స్ అంతా ఎడ్యుకేట్ అయి..విమర్శల్ని ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకున్నాం. నిజం చెబుతున్నాం. ఆంజనేయుడికి ఆయన బలం తెలియనట్లే…చిరంజీవి గారికి ఆయన శక్తి, ఆయన అభిమానుల శక్తి తెలియదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, స్టార్స్ అంటున్నాం గానీ చిరంజీవి గారు ఎప్పుడో గ్లోబల్ స్టార్. అంటార్కిటికాలోనూ ఆయనకు అభిమానులు ఉంటారు. వయసు మెగాస్టార్ విషయంలో ఒక నెంబర్ మాత్రమే. భోళా శంకర్ లో ఆయన వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే సర్ ప్రైజింగ్ గా ఉంది. అందుకే ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాస్ రా బచ్చా అని చెబుతుంటా. చిరంజీవి ఫ్యాన్స్ అంటే బ్యానర్స్ కట్టేవాళ్లమే కాదు బ్యానర్స్ పెట్టేవాళ్లమని గర్వంగా చెబుతున్నా. నాకు వచ్చిన సక్సెస్ క్రెడిట్ అంతా చిరంజీవి గారిదే. మీరు లేకుంటే ఒక సాయి రాజేష్, మారుతి, నేను..నాలాంటి వారు లేరు. విజయ్ తో టాక్సీవాలా, ఆనంద్ తో బేబీ చేశాను. వర్ధన్ గారు ఇందాక నన్ను ఎస్కేఎన్ దేవరకొండ అని పిలుస్తున్నారు. మీ ఇద్దరితో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకోవడం మెగాస్టార్ చిరంజీవి గారికి అలవాటు. ఫ్యాన్స్ పైకొస్తే ఆయనకంటే ఆనందించేవారు ఉండరు. నాలో దర్శకుడిని గుర్తించి ఎంకరేజ్ చేసింది ఆయనే. ఇవాళ ప్యాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తున్నానంటే అందుకు కారణం చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహమే. నేను, సాయి రాజేష్, ఎస్కేఎన్ మేమంతా చిరంజీవి గారి అభిమానులమే. మేమంతా కలిసి చేసిన సినిమాను బ్లెస్ చేసేందుకు చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమా చేసిన బేబీ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – నేను బేబి సినిమా విజయోత్సవ సభకు వచ్చానా లేక నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావడం లేదు. నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నా. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను, అలాగే తమ్ముళ్ల అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాను. అలాగే నా మేనళ్లుల్లు, మిత్రులు నాతో పాటు ఎదుగుతూ విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్న నాకు..దేవుడు ఇచ్చిన తమ్ముళ్లైన అభిమానులు..నన్ను స్ఫూర్తిగా తీసుకుని… మనం కూడా సాధించవచ్చు అని తమకంటూ ఒక మార్కు చూపిస్తూ ,సక్సెస్ అందుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ ఈ బేబీ ఫంక్షన్. ఎస్కేఎన్ సాయిరాజేష్ ఎప్పటినుంచో తెలుసు. వాళ్లను నేను తరుచూ కలవకున్నా వాళ్లు చేసే సినిమా ప్రయత్నాల గురించి వింటూనే ఉంటాను. అభిమానులు అంటే థియేటర్ లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు..ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చా ఇలా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించేవారు ఉండరు. హీరోల అభిమానులంటే ఒక లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్ధ పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడతారు అనే రోజుల నుంచీ నాకు తెలుసు. అవి నా చెవిన పడిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.
మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. మారుతి సాఫ్ట్ వేర్ కంపెనీకి పనిచేస్తుంటే..ఒక రోజు ఒక పాట ఆడియో ఇచ్చి దీనికి విజువల్స్ తీసుకుని రా అని చెప్పాను. అతను వెళ్లి మంచి విజువల్స్ తెచ్చాడు. అప్పుడే అనిపించింది ఇతనిలో డైరెక్టర్ ఉన్నాడని, ఆ మాటే మారుతికి చెప్పాను. నా మాట నమ్మాడు. ఇవాళ పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసే దర్శకుడు అయ్యాడు. ఎస్కేఎన్ ఏలూరులో నా సినిమా బ్యానర్స్ కట్టే అభిమాని టైమ్ నుంచి తెలుసు. గీతా ఆర్ట్స్ లో అరవింద్ గారు, బన్నీ సపోర్ట్ తో ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజుల్లో, టాక్సీవాలా..ఇప్పుడు బేబి మూవీ ప్రొడ్యూస్ చేశాడు. నా అభిమానిగా అతని ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. ఇవాళ ఎస్కేఎన్ ఎంతోమందికి ఇన్సిపిరేషన్ గా నిలిచాడు. అతని స్పీచ్ లు కూడా ఈ మధ్య కొన్ని విన్నాను. సాయి రాజేష్ మొదట్లో స్పూఫ్ సినిమాలు చేశాడు. కలర్ ఫొటోతో కథా రచయితగా తన సత్తాచాటాడు. జాతీయ అవార్డ్ గెల్చుకున్నాడు. ఇవాళ బేబి మూవీతో ఒక కాంటెంపరరీ మూవీ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. అతను నా అభిమాని కావడం గర్వంగా ఉంది. ఇండస్ట్రీలోకి కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలు కావాలి. అప్పుడే ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఆస్కార్ వరకు తెలుసు సినిమాలు వెళ్లగలుగుతున్నాయి. కొత్త దర్శకులు ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగమైతే…అదే మీరు చేసే ప్రత్యుపకారం అనుకోవాలి. ఆనంద్ గతంలో చేసిన ఒక సినిమా చూశాను. ఇప్పుడు బేబి చూస్తుంటే నటుడిగా ఆనంద్ ఎంతో పరిణితి చెందాడని అనిపించింది. బస్తీ కుర్రాడిగా సహజంగా నటిస్తూ వచ్చాడు. ఒక సీన్ లో అతను పలికించిన భావోద్వేగాలు చూసి ఇంత బాగా ఆనంద్ నటించగలడా వావ్ అనిపించింది. ఆనంద్ లో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. ప్రతి సీన్ అతను ఫీల్ అయి చేస్తాడు. ఆ ఫీల్ మనకు అతని ఫేస్ లో కనిపిస్తుంటుంది. బేబి క్యారెక్టర్ లో ఆనంద్ నటనను కాదు హృదయాన్ని చూశాను. విరాజ్, అశ్విన్ చక్కగా నటించారు. లవ్ స్టోరిస్ చాలా చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో అందరూ మంచి వాళ్లే. విలన్ లేకుండా ఇంతబాగా చూపించగలిగారు అంటే సర్ ప్రైజ్ అయ్యాను. వైష్ణవి మానసిక సంఘర్షణ ఆకట్టుకునేలా చూపించారు. ఆ స్ట్రగుల్ సినిమాను నిలబెట్టింది. బస్తీలో అమాయకపు అమ్మాయిగా కాలేజ్ లో ట్రెండీ మేకోవర్ లోకి మారే యువతిగా వైష్ణవి పర్మార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమా చూస్తున్నంత సేపూ చాలాసార్లు వైష్ణవి ఎంత మెచ్యూర్డ్ గా నటించింది అనిపించింది. విరాజ్ మన సినిమా ఫ్యామిలీ కుర్రాడే.
ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చాడు అనిపించింది. మనం ఎంత కష్టపడితే అంత గొప్పగా మనల్ని నిలబెట్టే పరిశ్రమ ఇదే. విరాజ్ చాలా అందంగా కనిపించాడు. విరాజ్ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తాడని అనుకుంటాం కానీ అతను నిజంగా ప్రేమించాడు. ఈ స్క్రిప్ట్ లోని గొప్పదనం అదే. అందరూ మంచి వాళ్లే. నిజమైన ప్రేమికుడిగా ఉండి అమ్మాయి ప్రేమ కోసం తపిస్తుంటాడు. ఇది ఎడ్యుకేట్ చేసే సినిమా. మీరు వదిలినా మిమ్మల్ని ఈ కంటెంట్ వదలదు. రెండు మూడు రోజులు నేను ఈ సినిమా మూడ్ లోనే ఉండిపోయాను. ఇవాళ చాలా మంది యువత సోషల్ మీడియా మాయలో పడిపోయి, ఎడిక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీకి కట్టుబడి పోతున్నారు. ఎక్కడో ఒక బలహీనమైన సమయంలో మాటో, తప్పు పనో చేస్తుంటారు. ఆ తప్పుల్ని క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిలింగ్స్ జరుగుతున్నాయి. ఆ తప్పులతో యువత సూసైడ్ దాకా వెళ్తున్నారు. అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అందుకే టెక్నాలజీని మంచికే వాడుకోవాలని కోరుతున్నా. జీవితంలో తెలిసో తెలియకో ఒక తప్పుచేసినా బాధపడుతూ కూర్చోకుండా ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని సాయిరాజేష్ ఈ సినిమాతో ఇచ్చాడు. అన్నారు